Kapu Leaders Meet: మళ్లీ తెరపైకి కాపు రాజకీయ పార్టీ! అనేక ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు!

ఇంకెన్నాళ్లు, శాసించే స్థాయిలో ఉన్నప్పటికీ అధికారానికి ఎందుకు దూరమవుతున్నాం. ఎన్నో అవకాశాలు వదులుకున్నాం. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అంటూ చర్చించుకుంటున్నారు కాపు సామాజిక లీడర్లు.

FOLLOW US: 

విశాఖ బీచ్ రోడ్‌లోని ఒక ప్రవేట్ హోటల్‌లో భేటీ అయిన కాపు సామాజిక ప్రముఖులు కీలక చర్చలు జరిపారు. గత డిసెంబర్‌లో హైదరాబాద్‌లో పార్టీలకతీతంగా సమావేశమై రహస్య సమాలోచనలు జరపడం సంచలనం సృష్టించింది. అది అత్యంత గోప్యంగా సాగింది. వాళ్లు భేటీ అయిన చాలా రోజుల తర్వాత ఆ విషయం లీక్‌ అయింది. 

ఈసారి మొన్నటి మీటింగ్‌కు భిన్నంగా అందరికీ తెలిసేలానే కాపు ప్రముఖుల సమావేశం సాగింది. ఈ భేటీలో మాజీ డీజీపీ సాంబశివరావు ,మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, వట్టి వసంత కుమార్, బోండా ఉమ పాల్గొన్నారు. సామాజికంగా, ఆర్ధికంగా కాపులు ఎదగడానికి రాజకీయ ప్రత్యామ్నాయమే ముఖ్యం అంటూ వారు నిర్ణయించారు. బహుజనులను కలుపుకొని రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఏపీలో ఎదగాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు మాజీ డీజీపీ సాంబ శివ రావు తెలిపారు .

రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఒక వేదిక ఉండాలంటూ ఫోరమ్ ఫర్  బెటర్ ఏపీని ప్రారంభించామని కాపు నేతలు చెబుతున్నారు. అయితే అది రాజకీయ పార్టీగా ఉంటుందా లేక లైక్ మైండెడ్ మనుషుల వేదికలా ఉంటుందా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. 

గతంలోనే కాపుల రాజకీయ పార్టీ వస్తుందంటూ ప్రచారం

గత డిసెంబర్‌లో కాపుల రాజకీయ పార్టీ రాబోతుంది అంటూ హడావుడి నడిచింది. దానికి కారణం కూడా ఈ నేతలే. అప్పట్లో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఇప్పటికంటే ఎక్కువమందే కాపు ప్రముఖులు కలిసి చర్చలు జరిపారు. వారిలో ఇప్పుడున్న నేతలతోపాటు వంగవీటి రాధా , సీబీఐ మాజీ  జేడీ లక్ష్మీనారాయణతోపాటు కొంతమంది కాపు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కాపులకు రాజ్యాధికారం ఎందుకు దక్కడం లేదంటూ సమాలోచనలు జరిపారని కథనాలు వెలువడ్డాయి. వాటిని కాపు నేతలు  ఖండించనూ లేదు అలాగని సమర్ధించనూ లేదు. దీనితో త్వరలోనే కాపుల రాజకీయ పార్టీ తెరపైకి వస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే అప్పటి నుంచి వ్యూహాత్మక మౌనం పాటించిన ఆ ప్రముఖులు మళ్ళీ ఇన్నాళ్ళకి వైజాగ‌్‌లో ప్రత్యక్షమయ్యారు. దీనితో మరోసారి కాపు రాజకీయం తెరపైకి వచ్చింది . 

రాజ్యాధికారం కోసం పోరాటం

గణాంకాల ప్రకారం ఏపీలో కాపు జనాభా కాస్త అటు ఇటుగా 15. 2 శాతం ఉంది. అదే కమ్మ సామజిక వర్గం సుమారు 4.8 శాతం, రెడ్డి సామాజికవర్గం 6. 2 శాతంగా ఉంది. తమకంటే జనాభా పరంగా ఎంతో తక్కువ ఉన్న రెడ్డి , కమ్మ సామాజిక వర్గాలే ఏపీలో సీఎం సీటుపై కూర్చుంటుంటే తామెన్నాళ్ళు ఆ ఘడియ కోసం ఎదురు చూడాలి అనే ప్రశ్న కాపు నేతల్లో ఉంది. గతంలో వచ్చిన అవకాశాలూ విఫలమయ్యాయి అనే అభిప్రాయం కాపు సామాజిక వర్గ ప్రముఖుల్లో వ్యక్తం అవుతుంది. వంగవీటి రంగ బతికున్న టైంలో రాజకీయంగా కాపుల  ప్రభావం అధికంగా ఉండేది. దళితుల సపోర్ట్ కూడా ఆయనకు బాగా ఉండడంతో ఇక నెక్స్ట్ సీఎం మోహన రంగానే అనే స్థాయిలో ఊహాగానాలు మొదలయ్యాయి. దానికి తోడు ఆయన ప్రారంభించిన కాపునాడు సూపర్ సక్సెస్ కావడం కూడా ఆ వార్తలకు బలం చేకూర్చాయి. అయితే ఆయన 26 డిసెంబర్ 1988న దారుణ హత్యకు గురికావడంతో ఆ కలలకు బ్రేక్ పడింది. తరువాత హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన దర్శకుడు దాసరి నారాయణ రావు ప్రభ వెలిగిపోతున్న సమయంలో మళ్ళీ కాపులకు రాజ్యాధికారం తెచ్చే ప్రయత్నాలు జరిగాయి. ఆయనకున్న క్రేజ్ ,పరిచయాలు వీటితోపాటు ఉదయం పేపర్ దన్ను కూడా బాగా ఉండడంతో రాజకీయాల్లో మార్పు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టే కనపడినా అవీ వర్క్ అవుట్ కాలేదు. 


ముద్రగడ పద్మనాభం ఆలోచనని ముంచిన ఆవేశం 

ఒకానొక దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాపు అంటే ముద్రగడ .. ముద్రగడ అంటే కాపు అనే స్థాయిలో ముద్రపడిపోయింది. కాపు సామాజిక వర్గ సమస్యలపైనా .. వారి ఐక్యత కోసం అలుపులేని పోరాటం చేసిన ముద్రగడ వారిని రాజకీయంగా మాత్రం ముందుకు నడపలేక పోయారు. ఒక్కోసారి ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఆయన ఉన్నతిని అడ్డుకున్నాయంటారు ఆయన సన్నిహితులు. రాష్ట్రరాజకీయాలను మలుపు తిప్పగల అన్ని అవకాశాలు ఉండికూడా సరైన దిశగా తన కాపు ఉద్యమాన్ని మళ్లించ లేకపోయారాయన.  


ప్రజారాజ్యం  ఓ విఫల ప్రయోగం

సినిమాల్లో తిరుగులేని మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవి 2009 ఎన్నికల్లో తాను  కొత్తగా స్థాపించిన  ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెస్, టీడీపీని ఢీ కొట్టారు. కేవలం తన క్రేజ్‌ని నమ్ముకోవడం తప్ప క్షేత్రస్థాయిలో సరైన అవగాహన లేకపోవడం, గ్రౌండ్ వర్క్ అన్నదే చేయకపోవడంతో 18 సీట్లకే పరిమితమయ్యారు. అయినప్పటికీ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే 18శాతం ఓటు షేర్ తెచ్చుకున్న పార్టీకి అధ్యక్షుడిగా నిలిచారు చిరంజీవి. తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ప్రజారాజ్యం పార్టీపై విపరీతమైన ఆశలు పెట్టుకున్న కాపు సామాజిక వర్గం నిస్పృహకు లోనైంది. చిరంజీవి 2004లో గనుక పార్టీ పెట్టి ఉన్నా.. విలీనం చెయ్యకుండా పార్టీని నడిపించుంటే తప్పకుండా సీఎం అయ్యుండేవారని విశ్లేషకులు ఇప్పటికీ చెబుతుంటారు. 

జనసేనపై మరి కొంత స్పష్టత అవసరం 

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల కారణంగా తెరపైకి వచ్చిన పార్టీ జనసేన. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ అది. పవర్ కోసం కాదు ప్రశ్నించడానికే అంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు . టీడీపీ గెలుపులో మాత్రం గణనీయమైన పాత్రే పోషించారు. రాజకీయంగా సరైన స్టెప్స్ తీసుకోకపోవడం, పార్టీని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లకపోవడంతో 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీ ముందు కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. అయితే పార్టీ అధ్యక్షుడు పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడం పార్టీ శ్రేణులను, పవన్ అభిమానులను షాక్ కు గురిచేసింది. అయినప్పటికీ ఆయన వెరవకుండా రాజకీయ రంగంలోనే నిలబడి పోరాడుతున్నారు .
 
ఎన్నాళ్ళు ఎదురు చూడాలి :కాపు నేతల్లో అంతర్మధనం 

ఇలా ఆశపడుతుండడం అంతలోనే నిస్పృహకు గురికావడం గతకొన్ని దశాబ్దాలుగా కాపు నేతలకు అలవాటైపోయింది. దాన్ని బద్దలుకొట్టి బహుజనులను కూడగట్టి ఒక ప్రత్యామ్నాయ రాజకీయా వేదిక కోసం కాపు సామాజిక వర్గ ప్రముఖులు వరుస భేటీలు మొదలుపెట్టారు. నిజానికి ఇదేమీ కొత్త కాదు. దాసరి నారాయణరావు బతికున్నపుడు చేసిందే. అప్పట్లో చిరంజీవి, బొత్సా లాంటి ప్రముఖులతో ఆయన కాపు సమావేశాలు ఏర్పాటు చేసేవారు. అలాగే గత  టీడీపీ హయాంలో కాపు ఎమ్మెల్యేల మీటింగులూ జరిగేవి. అయితే అవన్నీ గమ్యం లేని ప్రయత్నాలు గానే మిగిలిపోయాయి. ఆ తప్పు ఈసారి జరగరాదని కాపు సామాజిక ప్రముఖులు చేతులు కలిపారు. కచ్చితంగా 2024 ఎన్నికల నాటికీ ఒక రాజకీయ పార్టీ గానో లేక ఇప్పుడు చెబుతున్నట్టు ఒక రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక గానో మారాలనే కాపు నేతలు ప్రయత్నిస్తున్నారు . 


జనసేన ఉందిగా ..?

అయితే కాపు నేతలకు ఎదురవుతున్న ప్రశ్న జనసేన ఆల్రెడీ రాజకీయాల్లో ఉండగా మళ్ళీ కాపులకు వేరే పార్టీ అవసరమా అని ..! పవన్ కళ్యాణ్ కులాన్ని ఓన్ చేసుకున్నా లేకున్నా కాపులు మాత్రం ప్రస్తుతం జనసేనను తమ పార్టీగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే జనసేన గతం కంటే కాస్త ఎక్కువగానే కాపుల్లోకి చొచ్చుకెళ్లిందని రాజకేయవేత్తలు లెక్కలు గడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వేరే ప్రత్యామ్నాయ వేదిక ఎందుకు? జనసేనకు మద్దతు ఇస్తే సరిపోతుందిగా అని కాపు ప్రముఖులకు ఎదురవుతున్న ప్రశ్నలు వారిని ఆలోచనలో పడేస్తున్నాయి. అందుకే ఎటువంటి కీలక నిర్ణయాన్ని వెంటనే తీసుకోలేకపోతున్నారు వారు. దానిపై స్పష్టత వచ్చే వరకూ మాత్రం మరికొన్ని సమావేశాలు జరగడం తథ్యమనే చెప్పాలి . 

Published at : 28 Feb 2022 01:36 PM (IST) Tags: chiranjeevi pawan kalyan YSRCP jagan tdp janasena kapu leaders

సంబంధిత కథనాలు

Srikakulam Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం- ఇంటి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే !

Srikakulam Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం- ఇంటి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే !

Tammineni Seetharam : కుళ్లి, కృశించిపోయిన టీడీపీకి మహానాడులో దహన సంస్కారాలు, స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు

Tammineni Seetharam : కుళ్లి, కృశించిపోయిన టీడీపీకి మహానాడులో దహన సంస్కారాలు, స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు

Jupudi Prabhakar Rao : శెట్టిబలిజలను క్షమాపణలు కోరిన జూపూడి ప్రభాకర్, 'మత్తులో ఉండి చేశారా' కామెంట్స్ పై వివరణ

Jupudi Prabhakar Rao : శెట్టిబలిజలను క్షమాపణలు కోరిన జూపూడి ప్రభాకర్, 'మత్తులో ఉండి చేశారా' కామెంట్స్ పై వివరణ

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా వైసీపీ స్కెచ్‌

YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా  వైసీపీ స్కెచ్‌

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!