GVMC Council Meeting: జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో వైసీపీ నిరసన.. గీతం భూముల క్రమబద్ధీకరణపై రగడ
Visakhapatnam News | విశాఖపట్నం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా దారితీసింది. గీతం భూముల క్రమబద్ధీకరణను అజెండా నుంచి తొలగించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు.

GITAM Lands Issue | విశాఖపట్నం: విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఉదయం నిరసనల మధ్య ప్రారంభమైంది. విశాఖ ఎంపీ భరత్‌కు చెందిన గీతం విద్యాసంస్థలకు ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ (క్రమబద్ధీకరణ) చేసే అంశాన్ని సమావేశ అజెండాలో చేర్చడంపై వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తప్పుబట్టారు.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైయస్సార్సీపి కార్పొరేటర్లు నల్ల కండువాలు ధరించి జీవీఎంసీ సమావేశంలో తమ నిరసనను తెలిపారు. మేయర్ పోడియంను చుట్టుముట్టిన కార్పొరేటర్లు, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గీతం భూముల క్రమబద్ధీకరణ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేయడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో కౌన్సిల్ హాల్ హోరెత్తిపోయింది.

"రప్పా రప్పా సంస్కృతి" అంటూ టీడీపీ విమర్శలు
జీవీఎంసీ (GVMC) కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ల తీరుపై టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పట్టాభి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కౌన్సిల్‌లో వైసీపీ సభ్యులు అనైతికంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. వారి నాయకుడికి ఉన్న "రప్పా.. రప్పా" సంస్కృతినే ఇప్పుడు వైసీపీ సభ్యులు జీవీఎంసీ కౌన్సిల్ హాల్‌లో పాటిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధులుగా హుందాగా వ్యవహరించాల్సింది పోయి, గందరగోళం సృష్టించడం సరికాదని హితవు పలికారు.
గీతం విద్యాసంస్థల అంశంపై వైసీపీ రాద్ధాంతం వెనుక రాజకీయ కక్ష ఉందని పట్టాభి ఆరోపించారు. గత ఎన్నికలలో బొత్స సత్యనారాయణ సతీమణిని విశాఖ ఎంపీ భరత్ 5 లక్షల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారని, ఆ ఓటమిని జీర్ణించుకోలేకే ఇప్పుడు అదే అక్కసును గీతంపై వెళ్లగక్కుతున్నారని ఆయన విమర్శించారు. కోవిడ్ 19 క్లిష్ట సమయంలో గీతం సంస్థలు ఎంతో అద్భుతమైన వైద్య సేవలు అందించాయని అప్పట్లో ఇదే వైసీపీ నేతలు కొనియాడారని, ఇప్పుడు రాజకీయాల కోసం అదే గీతంపై విరుచుకుపడటం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. భరత్ ఒక రాజకీయనాయకుడు కాకుండా ఉంటే, అప్పుడు కూడా ఇలాగే అభ్యంతరం వ్యక్తం చేసేవారా? అని ఆయన ప్రశ్నించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























