(Source: Poll of Polls)
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనకు డేట్ ఫిక్స్ - సీఎం చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్ పోర్టు విజయనగరం జిల్లాలో రానుంది. విశాఖపట్నంకు ఈశాన్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భోగాపురం వద్ద నిర్మించనున్నారు.
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఏయిర్ పోర్టుకు మే 3న శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 2,200 ఎకరాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుందని వివరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడుతో కలసి ఆయన ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. శంకుస్థాపన చేసిన నాటి నుంచి పనులు ప్రారంభించి 24 నుంచి 30 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తారని చెప్పారు. నిర్మాణ బాధ్యతలను జీఎంఆర్ సంస్థ తీసుకుంటుందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు.
భోగాపురం ఎయిర్ పోర్టు విజయనగరం జిల్లాలో రానుంది. విశాఖపట్నానికి ఈశాన్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భోగాపురం వద్ద నిర్మించనున్నారు. విజయనగరం నుండి 25 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాకుళంకు 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం ప్రధానంగా ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతానికి సేవలు అందిస్తుంది. ఈ ప్రాంతంలో ఉపాధికి ప్రధాన వనరుగా ఈ ఎయిర్ పోర్టును భావిస్తున్నారు. ఈ ప్రాంతం ప్రస్తుతం జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 26 ద్వారా, భవిష్యత్తులో వైజాగ్ బీచ్ కారిడార్, వైజాగ్ మెట్రో ద్వారా నిర్మించనున్న విమానాశ్రయానికి అనుసంధానం అవుతుందని భావిస్తున్నారు.
విశాఖలో ఇప్పటికే ఎయిర్ పోర్టు, 40 కి.మీ.దూరంలోనే మరొకటి ఎందుకు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమయంలోనే విశాఖపట్నంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం భీమునిపట్నం, సబ్బవరం, అచ్చుతాపురం, కొరుప్రోలు వంటి ప్రత్యామ్నాయ స్థలాలను కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూన్ 2015లో ప్రాజెక్ట్ సైట్‌కి దాని సాంకేతిక అనుమతిని ఇచ్చింది.
ప్రస్తుత విశాఖపట్నం విమానాశ్రయం నావల్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఒక సివిల్ ఎన్‌క్లేవ్. దీనికి ‘‘నియంత్రిత అంతర్జాతీయ విమానాశ్రయం’’ హోదా కారణంగా దీనికి అనేకరకమైన పరిమితులు ఉన్నాయి. వీలైనన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడంపై కూడా నియంత్రణ ఉంది. నావికాదళం ప్రస్తుత విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం ఫ్లయింగ్ స్లాట్‌లను ప్రతిపాదించింది. అందువల్ల విశాఖ విమానాశ్రయం పరిమితుల మధ్య నడుపుతున్నారు.
2022 సెప్టెంబర్‌లో విశాఖపట్నం విమానాశ్రయాన్ని భోగాపురానికి తరలించేందుకు ఇండియన్ నేవీ అధికారులు అంగీకరించారు. దీనికి సంబంధించి, ఇండియన్ నేవీ, ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) అధికారులు న్యూఢిల్లీలో ఎంవోయూపై సంతకాలు చేశారు. మరోవైపు భోగాపురంలో నిర్మాణానికి ఇంకా 28 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది. ఈ అంశంపై కోర్టు కేసుల విచారణ పూర్తయి తీర్పు రిజర్వ్‌లో ఉంది. విమానాశ్రయం నిర్మాణం 2022 చివరి నాటికి ప్రారంభమవుతుందని అంచనా వేశారు. కానీ, మే 3న శంకుస్థాపన ఉంటుందని తాజాగా ప్రకటించారు. ఫేజ్ 1 నిర్మాణం పూర్తయిన తర్వాత, టెర్మినల్ నిర్వహణ సామర్థ్యం సంవత్సరానికి 6.3 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఉంటుంది. ఫేజ్ 2 కూడా పూర్తయిన తర్వాత సంవత్సరానికి 18 మిలియన్ల ప్రయాణీకులు రాకపోకలు సాగించే స్థాయికి సామర్థ్యం పెరుగుతుంది.