Dharmana: విశాఖ రాజధాని కోసం ఉత్తరాంధ్రులు నోరెందుకు విప్పడం లేదు, మీకేంటి ఇబ్బంది?: ధర్మాన
Dharmana: విశాఖ రాజధాని కోసం ఉత్తరాంధ్ర వాసులు నోరెందుకు విప్పడం లేదని మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రశ్నించారు. విశాఖకను రాజధాని చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
Dharmana: విశాఖపట్నాన్ని రాజధాన్ని చేయాలని ఉత్తరాంధ్ర వాసులు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వాసులు నోరు ఎందుకు విప్పడం లేదని, ఎందుకు అంత కష్టంగా ఉందని ఆయన అడిగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జై అనడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ఉత్తరాంధ్ర వాసులను మంత్రి ధర్మాన ప్రశ్నించారు. విశాఖ రాజధాని సాధన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరై మాట్లాడారు. జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందని మీకు అనిపిస్తే చెప్పండని, సరిదిద్దుకుంటామని ధర్మాన ప్రసాద రావు విజ్ఞప్తి చేశారు.
'ప్రజల మనసులో చోటే నాకు ముఖ్యం'
ప్రాంతాల అభివృద్ధి కంటే తనకు మంత్రి పదవి గొప్ప కాదని మంత్రి ధర్మాన వెల్లడించారు. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచి పోవడం కంటే తనకు పదవి ఏం గొప్ప కాదని తెలిపారు. తాను రేపో మాపో రాజకీయాల నుండి పదవీ విరమణ పొందనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం రాజధాని విషయంలో రాష్ట్ర యువతే ఆలోచించుకోవాలని మంత్రి కోరారు. అమరావతిలో అన్ని వసతులతో రాజధానిని నిర్మించాలంటే లక్షలాది కోట్ల రూపాయలు కావాలని, అదే విశాఖలో రాజధానిని కొనసాగించేందుకు కేవలం రూ. 1500 కోట్లు సరిపోతుందని రెవెన్యూ మినిస్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష నెరవేర్చేందుకు తామంతా సమిధలుగా మారతామని వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, 75 ఏళ్లలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి ఉంటే విభజన ఉద్యమం వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి నష్టం వచ్చేది కాదని అన్నారు.
'విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయి'
శ్రీకృష్ణ కమిటీ భారీ వ్యయంతో రాజధానిని నిరాకరించినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు లక్షల కోట్లు అవసరమయ్యే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించారని ధర్మాన చెప్పారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ ఆలోచనతో రూపొందిన రాజధాని అమరావతి అని, రాజధానిని ప్రకటించకముందే చంద్రబాబు సన్నిహితులు అమరావతిలో భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. పరిపాలనా రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు నారాయణ కమిటీ వేసి 3,940 రహస్య జీవోలు జారీ చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరై విశాఖను రాష్ట్ర రాజధానిగా చేయాలని కోరారు. విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు గౌరవప్రదమైన, శక్తివంతమైన రాజధాని వస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతితో సహా రాష్ట్రం యొక్క మొత్తం అభివృద్ధికి ఇది నిర్ధారిస్తుందని, అన్ని జిల్లాల మధ్య ఆదాయ సమాన పంపిణీకి దారి తీస్తుందని తెలిపారు.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో విశాఖను రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా మార్చేందుకు కృషి చేయాలని 50కి పైగా సంఘాలతో కూడిన పోరాట వేదిక విశాఖ రాజధాని సాధన ఐక్య వేదిక ఆదివారం తీర్మానించింది. తెలంగాణ ఉద్యమం తరహాలో ఈ ప్రాంతంలోని 6,200 గ్రామాలు, దాదాపు 35 చిన్న, మధ్యతరహా పట్టణాల ప్రజల మద్దతును కూడగట్టాలని ఫోరమ్ యోచిస్తోంది. అలాగే అమరావతి ప్రజల మనోభావాలు, వెనుకబాటుతనాన్ని సీఎం వైఎస్‌కు వివరించేందుకు బస్సుయాత్ర చేపట్టాలని యోచిస్తోంది.