Srikakulam News: మత్సకారుల మధ్య మరింత ముదురుతోన్న రింగు వలల వివాదం, పరిష్కారం చూపేదెవరు?
Andhra Pradesh News | శ్రీకాకుళంలో నిషేధించిన రింగు వలలతో సముద్రంలో చేపల వేట చేపట్టడంపై జిల్లాలో గత కొద్ది రోజులుగా దుమారం నడుస్తోంది.

చేపల వేటలో రింగువల వినియోగించడాన్ని ప్రభుత్వం నిషేధించినా శ్రీకాకుళం (Srikakulam) జిల్లా మత్స్యశాఖ డీడీ శ్రీనివాస్ నిర్వాకం వల్ల జిల్లా వ్యాప్తంగా వీటిని వినియోగించి సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాకుళం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడమే ఇందుకు సాక్ష్యం. రింగు వలలు వినియోగిస్తున్న మరబోట్ల యజమాన్యాలు పెద్ద మొత్తంలో మంత్లీలు ముట్టజెప్పడం వల్లే డీడీ శ్రీనివాసరావు కళ్లు మూసుకున్నారని సంప్రదాయ మత్స్యకారుల నుంచి విమర్శలు ఉన్నాయి. రింగు వలలో చిక్కిన ఏ చేప కూడా మళ్లీ సముద్రంలోకి పోలేదు. మత్స్యసంపద వృద్ధికి అవసరమైన పిల్లచేపలు కూడా ఈ వలలో చిక్కుకుంటాయి.
రింగు వల వేస్తే ఏమవుతుంది..
సంప్రదాయ మత్స్యకారులు చేపల వృద్ధి కోసం చిన్న చేపలను వేటాడరు. రింగు వల వేస్తే మాత్రం చిన్న, పెద్ద తేడా లేకుండా చేపలు పెద్ద సంఖ్యలో చిక్కుతాయి. అవి బయటకు పోలేవు. ఎందుకంటే.. రింగు వల కన్నాలు అంత చిన్నగా ఉంటాయి. చిన్న చేపలైన నెత్తళ్లు వంటివి కిలోమీటర్ల మేర సమూహాలుగా ఉంటాయి. అర కిలోమీటరు నుంచి కిలోమీటరు వ్యాసార్థం వరకు ఉండే నెత్తళ్ల సమూహాలను సైతం ఈ రింగువలలు చుట్టిపడేస్తాయి. కొన్నాళ్లు అదే పనిగా రింగువలలతో ఫిషింగ్ చేస్తే, ఆ ప్రాంతంలో చేపల ఆచూకీ లేకుండాపోతుందని 2005 ఆగస్టు 6న అప్పటి ప్రభుత్వం జీవో 384ను జారీచేసి రింగు వలల వినియోగాన్ని నిషేధించింది. దీనిపైనే ఇక్కడి మాదిరిగానే విశాఖపట్నంలో రింగ్‌వలలు వాడుతున్నవారికి, సంప్రదాయ మత్స్యకారులకు మధ్య యుద్ధమే జరిగింది. తరచుగా వలలు తగులబెట్టుకొని శాంతిభద్రతలకు సమస్యగా కూడా తయారైంది. ఇప్పుడు అటువంటి వాతావరణం ఏర్పడకుండా చూడాల్సిన మత్స్యశాఖ అధికారి స్వయంగా సంప్రదాయ మత్స్యకారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
ప్రజాప్రతినిధుల అండతో..
జిల్లాలో తీర ప్రాంతాల్లో ఉన్న 11 మండలాల్లో రింగు వలలను కొందరు మరబోటు యజమానులు వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల ఆయా గ్రామాలు తీర్మానాలు చేసి రింగు వలలు వినియోగించడాన్ని నిషేధించాయి. అయితే కొన్నిచోట్ల రాజకీయ పార్టీల నాయకుల అండదండలతో రింగు వలలతో చేపల వేట సాగిస్తున్నారు. వీరికి మత్స్యశాఖ అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారనేదే ఇక్కడ ప్రధాన అంశం. ఈ విషయాన్నే ఈ నెల 20న శ్రీకాకుళం మండలం పెద్దగనగళ్లపేట సర్పంచ్ ప్రజాగ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వైకాపా హయాం నుంచి పెద్దగనగళ్లపేటకు చెందిన కొందరు రింగు వలలతో వేట సాగించేవారని, దీనిపై ఫిర్యాదు చేస్తే రెండు పర్యాయాలు గ్రామంలో సమావేశాలు నిర్వహించి చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టేశారని కలెక్టర్‌కు వివరించారు. వైకాపా ప్రజాప్రతినిధుల సహకారంతో మత్స్యశాఖ డీడీ శ్రీనివాసరావు అండదండలతో రింగు వలలతోనే యథేచ్చగా మత్స్యసంపదను కొల్లగొట్టారని పేర్కొన్నారు. ఇప్పటికీ వారు అదే పద్ధతిలో చేపల వేట కొనసాగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మత్స్యశాఖ డీడీ ఏకపక్ష నిర్ణయాల వల్ల గ్రామంలో సుమారు 300 తెడ్డు బోట్లతో చేపల వేట నిర్వహిస్తున్న వెయ్యి మంది సంప్రదాయ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారని కలెక్టర్‌కు వివరించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ముందు కూడా మత్స్యకారులు తమ గోడు వెల్లబుచ్చుకోవడంతో ఆయన మత్స్యశాఖ డీడీ శ్రీనివాసరావును ప్రశ్నించినట్టు తెలిసింది. గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డీడీ శ్రీనివాస్‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో శ్రీకాకుళం రూరల్, మెరైన్ ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది, డీఎఫ్‌వో, మత్స్యశాఖ డీడీ, పెద్దగనగళ్లవానిపేట గ్రామ పెద్దలు, మత్స్యకారులతో గురువారం గ్రామంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైనవారంతా ముక్తకంఠంతో రింగు వలలు నిషేధించాలని కోరినా మత్స్యశాఖ డీడీ శ్రీనివాస్ మాత్రం రింగు లీడర్లకు వత్తాసు పలుకుతూ మాట్లాడారని హాజరైన సంప్రదాయ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తనకు 15 రోజుల సమయం ఇవ్వాలని, కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకువెళ్లి జిల్లా స్థాయిలో దీనికి పరిష్కారం చూపించాల్సి ఉందని డీడీ శ్రీనివాసరావు సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.
పట్టుకొని.. విడిచిపెట్టారు
గార మండలం పరిధిలో బలరాంపురం, శ్రీకూర్మంకు చెందిన మత్స్యకారులు రింగు వలలను చేపలవేటలో వినియోగించడానికి వీళ్లేదని తీర్మానించుకున్నారు. ఆ తర్వాత పెద్దగనగళ్లపేటకు చెందిన కొంద రింగువలతో వారి పరిధిలో చేపల వేట చేయడాన్ని గుర్తించి బలరాంపురానికి చెందిన మత్స్యకారులు అడ్డగించి రింగువలను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఆ తర్వాత శ్రీకూర్మంలో కూడా ఇదే పద్ధతిలో వలను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఆ తర్వాత వీరి మధ్య రాజీ కుదిరి వాటిని వెనక్కి ఇచ్చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేటలో రింగు వలలను వినియోగించకూడదని గ్రామస్తులే తీర్మానించుకున్నారు.
రింగు వలలంటే..
తరుచూ మత్స్యకారుల మధ్య వివాదానికి రింగు వలలు కారణమవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం నిషేధించినా ప్రజాప్రతినిధులు, అధికారుల జోక్యంతో రింగు వలలను వినియోగిస్తున్నారు. మత్స్యకారులు వేట కోసం అనేక రకాల వలలను వినియోగిస్తుంటారు. వీటిలో రింగు వల, బల్ల వల, అల్లివల, పోస వల ఇలా అనేక వలలు ఉంటాయి. చేప రకం, వేట చేసే స్థలం, వేట చేసే సీజన్ బట్టి ఈ వలలను వాడుతుంటారు. కోనాం, సొర, వంజరం, కవ్వళ్లు, చందువ వంటి రకరకాల చేపలను పట్టేందుకు అనుగుణంగా ఈ వలలను వాడతారు. వలలు తయారు చేసేటప్పుడే అందులో ఏ సైజు చేప చిక్కాలి అనే లెక్కలేసుకుని దానికి తగ్గట్టుగానే వలకు పెట్టే ఖాళీ (నెట్ హోల్) సైజుని నిర్ణయిస్తారు. ఈ హోల్‌ను మత్స్యకారులు కళ్లు, అచ్చు, మెడ అని మూడు రకాలైన పేర్లతో పిలుస్తారు.
పెద్ద చేపలను వేటాడే మత్స్యకారుల వలలో పడిన చిన్న చేపలు సముద్రంలోకి వెళ్లిపోయేలా వలల కళ్లు (కన్నాలు) పరిమాణం ఉంటుంది. ఎటువంటి చేపలనైనా పట్టేందుకు మిగతా వలల కంటే భిన్నంగా ఉండేవే రింగు వలలు. వలను సముద్రంలో వేసిన తర్వాత అది అటు ఇటు జరిగిపోకుండా, లేదంటే పైకి తేలిపోకుండా చేపలు చిక్కేందుకు వీలుగా గిన్నెలాగా ఉండేందుకు ఈ వలకు దిగువ భాగాన బరువుగా ఉండే రింగులను వేలాడదీస్తారు. అందుకే ఈ వలలను రింగు వలలు అంటారు. వీటిని కనీసం 10 నుంచి 15 బోట్ల సహాయంతో 30 నుంచి 50 మంది కలిసి సముద్రంలో వేస్తారు. దీంతో రింగువలలతో వేట చేసే పరిసరాల్లో సంప్రదాయ మత్స్యకారులకు చేపలు దొరకక జీవనోపాధిని కోల్పోతున్నారని మత్స్యకార సంఘాల నాయకులు చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

