(Source: ECI/ABP News/ABP Majha)
Botsa Satyanarayana: జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం ఫిక్స్ - బొత్స సత్యనారాయణ
AP Latest News: విజయనగరంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జూన్ 4న వెల్లడికాబోయే ఫలితాల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని తాము విశ్వాసంతో ఉన్నామని అన్నారు.
Botsa Satyanarayana Comments on CM Jagan Oath Ceremony: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూన్ 9న మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూన్ 4న వెల్లడికాబోయే ఫలితాల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని తాము విశ్వాసంతో ఉన్నామని అన్నారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలతో మమేకమయ్యారని.. ప్రజా అవసరాలకు తగ్గట్లుగా ఆయన పాలన చేపట్టారని అన్నారు. జగన్ తీసుకున్న సామాన్య పౌరుడు ఆర్థికంగా ఎదిగేలా తీసుకున్నామని అన్నారు.
సామాన్యులకు పూర్వం నుంచి అందుతూ వస్తున్న సేవల విషయంలో సీఎం జగన్ సంచలన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని అన్నారు. ఇలాంటి విధానాలు ప్రభుత్వం మారితే పోతాయని బొత్స అన్నారు. తన సొంత నియోజకవర్గం ఉన్న విజయనగరం జిల్లాలో ఉన్న 9 స్థానాల్లోనూ గడిచిన ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారని అన్నారు. అదే తరహాలో ఈ సారి పట్టం కడతారని విశ్వాసంతో ఉన్నట్లుగా బొత్స సత్యనారాయణ నమ్మకం వ్యక్తం చేశారు. ఆ జిల్లాలో తాము అనుకున్న దాని కంటే రెండు శాతం ఎక్కువగా పోలింగ్ జరిగిందని అన్నారు.
ఇంకా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజలకు గుమ్మం ముందుకే పాలన తీసుకువచ్చామని చెప్పారు. అందుకే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని.. దానికి చాలా మంచి పేరు వచ్చింది. ఇక్కడి పరిస్థితులను చూసి చాలా రాష్ట్రాల వాలంటీర్ వ్యవస్థను అమలు చేయడానికి రెడీగా ఉన్నాయని అన్నారు.
ఇక అన్ని పథకాలపై ఆరోపించడం టీడీపీకి అలవాటే అని.. విశాఖపట్నంలో కొంత మంది మీద దాడి జరిగితే దానికి రాజకీయ రంగు పులుమారని విమర్శించారు. కూటమి నేతలు ఎక్కువగా పోటీ చేసిన ఆ నాలుగు జిల్లాల్లోనే ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేశారని గుర్తు చేశారు. దానికి కారణం వారు చేసిన ఘటనలే అని అన్నారు. తమ నాయకుడు సీఎం జగన్ విదేశాలకు వెళ్తున్నట్లుగా చెప్పి.. వెళ్లారని.. కానీ చంద్రబాబు, లోకేశ్ మాత్రం ఎవరికీ చెప్పకుండానే అమెరికా వెళ్లారని విమర్శించారు. విజయనగరంలో ఉన్న 9 నియోజకవర్గాలకు తొమ్మిది స్థానాలు గెలుస్తామని అన్నారు. అలాగే రాష్ట్రంలో 175 కి 175 స్థానాలు గెలుస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు.