(Source: ECI/ABP News/ABP Majha)
ఏపీలో టీడీపీకి, వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే: ఎమ్మెల్సీ మాధవ్
టీడీపీకి, వైసీపీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ఆలస్యానికి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలే కారణం అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, వైసీపీపై బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలకు బీజేపీనే ప్రత్యామ్నాయమని, రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది తామేనని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీతోపాటు ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కూడా బీజేపీతో మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. విశాఖపట్నంలోని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై, టీడీపీపై విమర్శలు గుప్పించారు. విశాఖలో ఐఐపీఎం కల ఏడేళ్ల తర్వాత సాకారం అయిందని పేర్కొన్నారు. ఏడు కేంద్ర విద్యా సంస్థలు నెలకొల్పినట్టు వెల్లడించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకూ ఎయిమ్స్ కు నీళ్ల సరఫరా పైప్ లైన్ ఇవ్వలేదని పీవీఎన్ మాధవ్ విమర్శలు చేశారు.
'రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైల్వే జోన్ శంకుస్థాపన త్వరలోనే జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తెలిపారు. జోన్ ఇవ్వని వారమైతే కేంద్ర బడ్జెట్ లో నిధులు ఎందుకు ఇస్తామని ప్రశ్నించారు. జోన్ పై కొంత దుష్ప్రచారం జరిగిందని.. నిరాధార లీక్ లు ఆధారంగా ఆవాస్తవ కథనాలు వచ్చాయని మాధవ్ పేర్కొన్నారు. ఈ విష్టయాన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లామని తెలిపారు. వెంటనే రైల్వే మంత్రి స్పందించినట్లు బీజేపీ ఎమ్మెల్సీ వెల్లడించారు. విశాఖలో 25 ఏకరాలు స్థలాన్ని దక్షిణ కోస్తా రైల్వే స్థాపన సంబంధించి ఇవ్వాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఇవ్వలేదని ఆరోపించారు. 2020-21 బడ్జెట్ లో రూ. 175 కోట్లు ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఇచ్చామి మాధవ్ వివరించారు. త్వరలోనే అనేక రైళ్లు విశాఖపట్నం నుంచి మొదలు అవుతాయని తెలిపారు. ర్యాక్ సమస్య వల్ల చాలా రైలు మొదలు కావడం ఆలస్యమైందని తెలిపారు.
'ప్రభుత్వాల తప్పిదాల వల్లే పోలవరం ఆలస్యం'
గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు తప్పిదాల వల్లే పోలవరం ఆలస్యం అవుతోందని విమర్శించారు. సీఎం జగన్ ముంపు ప్రాంతాలకు వెళ్లి మాట్లాడిన తీరు దురదృష్టకరమని ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ ఆక్షేపించారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైన అప్పు తీసుకువచ్చి పనులు చేపడితే ఆ మేరకు కేంద్ర సర్కారు రియంబర్స్ చేస్తుందని వివరించారు. పోలవరం ప్రాజెక్టులో కమిషన్ లను పుచ్చుకున్నారని ఆరోపణలు చేశారు. ఈ రోజుకి మాన్యువల్ గానే బిల్లు సిద్ధం చేస్తున్నారని ఆక్షేపించారు. ఎందుకు ఆన్ లైన్ చెయ్యలేదని నిలదీశారు. పోలవరం ప్రాజెక్ట్ పునరావాస పరిహారం కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వడం లేదని అన్నారు. ఇచ్చే అవకాశం ఉంటే మొదట మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పీవీఎన్ మాధవ్ తెలిపారు. కొన్ని పరిశ్రమలలో కేంద్ర వాటా పెట్టుబడులు ఉపసంహరణకు వెళ్లామని, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండటంతో పెట్టుబడి ఉపసంహరణ కు వెళ్లినట్లు వెల్లడించారు. ప్లాంట్ ఉద్యోగుల సంక్షేమం, కార్మికుల శ్రేయస్సు కోసం ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్నట్లు వివరించారు.
'మేమే ప్రత్యామ్నాయం'
వైసీపీ, టీడీపీ లు ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదగకుండా అడ్డుపడుతున్నాయని ఆక్షేపించారు. ఏపీ ఈ రెండు పార్టీ లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు.