Atchutapuram Gas leak: అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విషవాయువు లీక్ - ప్రాణ భయంతో సెక్యూరిటీ పరుగులు
Atchutapuram Gas leak: సీడ్స్ వస్త్ర పరిశ్రమలో ఆదివారం ఘాటు వాసన రావడంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అక్కడి నుంచి సిబ్బంది పరుగులు తీశారు. మూడు రోజుల్లో విష వాయువులు విడుదల కావడం ఇది రెండోసారి.
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ (Brandix SEZ)లో మరోసారి విషవాయువు లీక్ కావడం కలకలం రేపింది. సీడ్స్ వస్త్ర పరిశ్రమలో ఆదివారం ఘాటు వాసన రావడంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అక్కడి నుంచి సిబ్బంది పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పీసీబీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. విష వాయువుల కారణంగా రెండు రోజులపాటు సెజ్ మూసివేయడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని తెలుస్తోంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డామని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు.
మూడు రోజుల కిందట బ్రాండిక్స్ సీడ్స్ సెజ్ నుంచి విషవాయువు లీక్ అయిన తరహాలో మరోసారి ఘాటు వాయువులు లీక్ అయ్యాయని కంపెనీ ప్రతినిధులు కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board)కి సమాచారం అందించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చేంతర తరకు బ్రాండిక్స్ సీడ్స్ కంపెనీ మూసివేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే అనకాపల్లి గ్యాస్ బాధిత మహిళలను పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా బాధితులకు తాము అండగా ఉంటామని, ఇలాంటి ఘటనలపై ప్రశ్నిస్తూనే ఉంటామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
శుక్రవారం తొలిసారి గ్యాస్ లీక్..
చ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లోని సీడ్స్ వస్త్ర పరిశ్రమ నుంచి శుక్రవారం విషవాయువు లీక్ అవ్వడంతో సుమారు 300 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చేవరకు కంపెనీ మూసివేయాలని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆదేశించారు. సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుంచి గాఢమైన అమ్మోనియా విషవాయువు లీక్ అయింది. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన మహిళలు అనకాపల్లిలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు ఒక్కొక్కరుగా కోలుకుంటున్నారు. పురుషులు త్వరగా కోలుకుంటుండుగా, మహిళలు కాస్త ఆలస్యంగా తేరుకుంటున్నారని సమాచారం. బాధితులకు మరోసారి వైద్య పరీక్షలు చేసి డిశ్చార్జ్ చేయాలని వైద్యులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
నిపుణుల కమిటీ నివేదిక..
తొలుత రెండు రోజులపాటు బ్రాండిక్స్ సెజ్‌లోని సీడ్స్ కంపెనీ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కంపెనీ మూసివేయడంతో ఆదివారం నాడు విష వాయువులు లీకైనా ప్రమాదం తప్పిపోయింది. మూడు రోజుల్లో రెండోసారి గ్యాస్ లీక్ కావడంతో నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తరువాతే సీడ్స్ కంపెనీ తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా గ్యాక్ లీకేజీ కావడంతో స్థానికులు సైతం దీనిపై భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణంలోనైనా విష వాయువులు మరోసారి లీకైతే ప్రాణాపాయం పొంచి ఉంటుందని కార్మికులు, సిబ్బంది భావిస్తున్నారు.
Also Read; Atchutapuram Gas Leak : అచ్యుతాపురం సెజ్ లో గ్యాస్ లీక్, సీడ్స్ కంపెనీ మూసివేత
Also Read: Journalist Passes Away: ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో విషాదం - గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ మృతి