Journalist Passes Away: ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో విషాదం - గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ మృతి
Journalist Mendu Srinivas Dies: క్రికెట్ ఆడుతూ తీవ్ర అస్వస్థతకు గురైన సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందారు. పలువురు ప్రముఖులు శ్రీనివాస్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆదివారం సరదాగా ఆట విడుపుగా క్రికెట్ ఆడటంతో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుందామనుకున్న మెండు శ్రీనివాస్.. పరిస్థితి బాగోలేదని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. సీనియర్ జర్నలిస్టు అకాల మరణంపై తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు శ్రీనివాస్ మరణం పట్ల సంతాపం ప్రకటించాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి.
ఫ్రెండ్లి మ్యాచ్‌తో విషాదం..
సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ పరకాల (ఆంధ్రజ్యోతి) క్రికెట్ టీమ్ పీసీసీ క్రికెట్ క్లబ్ ఫ్రెండ్లి మ్యాచ్ కోసం పరకాలకు వచ్చారు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు మెండు శ్రీనివాస్ 12 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. బాగా అలసిపోయానని, బై రన్నర్ కావాలని అడిగాడు. అయితే ఆయన పరిస్థితి గమనించిన సహచర ఆటగాళ్లు, బాగా అలసిపోయావు బై రన్నర్ వద్దు.. బయటకు వచ్చి రెస్ట్ తీసుకోవాలని సూచించారు. తోటి ఆటగాళ్లు వారించడంతో క్రీజు వదిలి బయటకు వచ్చిన మెండు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు.
చికిత్స పొందుతూ మృతి
ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుందామనుకున్న శ్రీనివాస్ కు పరిస్థితి చేజారుతున్నట్లు అనిపించి దగ్గర్లోని ఆసుపత్రిలో చేరారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా.. గుండెపోటు రావడంతో కన్నుమూశారని సమాచారం.
రాజకీయ నేతల సంతాపం..
సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్, గత 21ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ వార్తలు ప్రజలకు చేరవేస్తున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం వారి స్వగ్రామం పరకాలలో తీవ్రగుండెపోటుతో ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతూ మృతిచెందారు. తనకు అత్యంత ఆప్తుడు మెండు శ్రీనివాస్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీనివాస్ మరణం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవండుడిని ప్రార్థించారు రేవంత్ రెడ్డి.
సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ హఠాత్ మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆయన ఆకస్మిక మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్ట్ గా మెండు శ్రీనివాస్ పోషించిన పాత్ర మరువలేనిది అన్నారు.
సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ కొద్ది సేపటి క్రితం వారి స్వగ్రామం పరకాలలో గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతూ మృతిచెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ లు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి.