డ్రగ్స్ వద్దని యువత చెప్పాలి.. ప్రతిజ్ఞ చేయించిన రవి శంకర్
డ్రగ్‌కు యువత దూరంగా ఉండాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవి శంకర్ సూచించారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. గీతంలో నిర్వహించిన ఎడుయూత్‌లో పాల్గొని యువతకు సూచనలు చేశారు.
Say No To Drugs: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు రవి శంకర్ గురూజీ విశాఖలోని గీతం యూనివర్శిటీలో నిర్వహించిన ఎడుయూత్ మీట్‌లో పాల్గొని యువతకు కీలక సూచనలు చేశారు. డ్రగ్‌కు యువత బానిసలుగా మారుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. వీటికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు. ఈ సందర్భంగా మీట్‌కు హాజరైన సుమారు 50 వేల మంది విద్యార్థులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఒకే చోట 50 వేల మందితో ప్రతిజ్ఞ చేయించడం రికార్డుగా నమోదైంది. ఈ మేరకు ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు రవి శంకర్ గురూజీకి రికార్డు పత్రాన్ని అందించారు. ఒకేచోట వేలాది మందితో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం రికార్డుగా నమోదైనట్టు ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి దిలీప్ పాత్రో పేర్కొన్నారు. ఈ మీట్‌లో మాట్లాడిన రవి శంకర్ గురూజీ యువతకు కీలక సూచనలు చేశారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి డ్రగ్స్ ప్రమాదమని హెచ్చరించారు.
సంకల్పం తీసుకోవాలని యువతకు సూచన
డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని యువత సంకల్పం తీసుకోవాలని రవి శంకర్ గురూజీ యువతకు పిలుపునిచ్చారు. ఎవరైనా తీసుకుంటే వారించాలని సూచించారు. ఆనందాన్ని వెతుక్కునే క్రమంలో ఇటువంటి అలవాట్ల వైపు అడుగులు వేస్తున్నారన్న రవి శంకర్.. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చెడిపోతుందని హెచ్చరించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల నెర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుందని విద్యార్థులను హెచ్చరించారు. యువతలో అద్భుతమైన ప్రతిభ ఉందని, దాన్ని గుర్తించి వెలికి తీస్తే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందని రవి శంకర్ ఈ సందర్భంగా స్పష్టం చేవారు. యువత ఆనందంగా ఉండేలా చేసేందుకు కృషి చేస్తున్నామని, ఆ దిశగా తమతో కలిసి అడుగులు వేయాలని ఆయన కోరారు. అంతా మనవాల్లే అన్న ఆత్మీయ భావం ప్రతి ఒక్కరిలోనూ పెరగాలని ఆయన సూచించారు. సెల్‌ఫోన్ అడిక్షన్ నుంచి బయటకు వచ్చేందుకు కృషి చేయాలని, ఇందుకు ఉన్న ఏకైక మార్గం నిద్రకు ముందు, తరువాత రెండు గంటలపాటు ఫోన్‌కు దూరంగా ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్‌ను ఎక్కువగా చూస్తున్నప్పుడు కళ్లను ఆర్పుతూ ఉండాలని, దీనివల్ల బ్రెయిన్‌పై ఒత్తిడి తగ్గుతుందన్నారు.
ఇన్నర్ పవర్‌తో సమర్థత..
ఇన్నర్ పవర్‌తో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సమర్థత లభిస్తుందని రవి శంకర్ గురూజీ పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఇన్నర్ పవర్‌తోనే లభిస్తుందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ మానవులు తయారీతోనే ప్రపంచంలోకి వచ్చిందని స్పష్టం చేసిన రవి శంకర్ గురూజీ.. మానవుడు విలువలతో కూడిన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అప్పుడే ఈ తరహా వాటికి అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేశారు. మీ కోసం తానున్నాన్న భరోసాను ఎదుటి వారికి కల్పించాలని సూచించారు. ఈ మాట వారిలో కాన్ఫిడెంట్‌ను పెంచుతుందని స్పష్టం చేశారు. యోగా, మెడిటేషన్‌తో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు అవకాశముందని, ఆ దిశగా యువత దృష్టి సారించాలని కోరారు.