AP TNSF Protest: విద్యార్థుల సమస్యలపై తెలుగుదేశం పోరుబాట- డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా టీఎన్ఎస్ఎఫ్ నిరసనలు
AP TNSF Protest: ఏపీ వ్యాప్తంగా సంక్షేమ శాఖల వసతిగృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 5న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు.
AP TNSF Protest: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం ఫైట్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తెలిపారు.
టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో " సంక్షేమ హాస్టల్ పోరు బాట" కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా సీతమ్మధార ప్రాంతంలో ఉన్న ఎస్సీ హాస్టల్‌ను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ సందర్శించారు. వసతి గృహంలో తాగునీరు లేక మరుగుదొడ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని అక్కడి విద్యార్థులు తెలిపారు. మరుగుదొడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయకపోవడంతో విపరీతమైన కంపు వస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా నాణ్యత లేని భోజనం, చెడిపోయిన గుడ్లు రోజూ పెడుతున్నారని ట్రంక్ పెట్టెలు, కాస్మెటిక్ చార్జీలను ఇవ్వడం లేదని పిల్లలు తెలిపారు.
ఈనెలాఖరు వరకు సాగనున్న సంక్షేమ హాస్టల్ పోరుబాట..
విద్యార్థులతోపాటు ప్రణవ గోపాల్ కూడా హాస్టల్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. 'చేతకాని సీఎం''అంటూ పిల్లలు నినాదాలు చేశారు. ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, ఇలాంటి భవనంలో విద్యార్థులను ఎలా ఉంచుతున్నారని ప్రణవ గోపాల్ వార్డెన్ ను ప్రశ్నించారు. మరుగు దొడ్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, కనీసం దీపాలు కూడా లేని పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ "సంక్షేమ హాస్టల్ పోరు బాట" కొనసాగుతుందని తెలిపారు. అంతే కాకుండా అన్ని వసతి గృహాలను సందర్శించి ఆయా వసతి గృహాల్లో ఉండే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.
మంత్రులు కూడా విద్యార్థుల సమస్యలు పట్టించుకోవాలి..
టీఎన్ఎస్ఎఫ్ తోపాటు ఆయా శాఖల మంత్రులు పాల్గొంటే... సమస్యలను గుర్తిస్తారని, ఇప్పటికైనా సంక్షేమ శాఖల మంత్రులు కళ్లు తెరిచి సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు టీడీపీ లీడర్లు. ప్రభుత్వం ఇచ్చే మెస్ చార్జీలు పెంచాలని, శిథిలావస్థకు చేరిన భవనాలను బాగు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణు గోపాల్, పార్లమెంట్ అధ్యక్షుడు ఎస్ రతన్ కాంత్, అవినాష్, కిరణ్, ప్రీతం, తదితరులు పాల్గొన్నారు.
అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు..
డిసెంబర్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా టీఎన్ఎస్ఎఫ్ నిరసనలు చేపడుతుందని తెలిపారు. వసతి గృహాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలతో పాటు విద్యార్థులు కూడా పాల్గొనాలని సూచించారు. ఆరోజు సమస్యలు తీరుస్తామని సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు హామీలు ఇవ్వకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ప్రణవ గోపాల్ హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించే వరకు ఈ ఆందోళన ఆపబోమని తెలిపారు.