Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు
రైతులు పాదయాత్ర చేస్తుంటే కొందరు మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మీరు అభివృద్ధి చేస్తే ఎవరు వద్దంటున్నారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
రాష్ట్రం బొత్సా జాగీరు కాదు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల పాదయాత్రను అడ్డుకోవటానికి 5 నిమిషాలు చాలు అని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే కొందరు మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందొద్దా అని ప్రశ్నిస్తున్నారు. మీరు అభివృద్ధి చేస్తే ఎవరు వద్దంటున్నారు.. అంటూ ఏపీ మంత్రులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటే ఉత్తరాంధ్ర ప్రజలు వద్దంటున్నారా..? అచ్చెన్నాయిడు వద్దంటున్నాడా.. లేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దన్నాడా..? అని ఉత్తరాంధ్ర మంత్రుల్ని సూటిగా ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికే మూడు రాజధానులు అంటూ డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలపై మండిపడ్డారు. ఒకవేళ అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ భావించినట్లయితే, ఉత్తరాంధ్ర మంత్రులకు తమ ప్రాంతంపై చిత్తశుద్ధి ఉన్నటయితే.. ఈ మూడు సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మీరు ఈ ప్రాంత ప్రజలకు ఏమీ చేయకపోగా, ఉన్న అభివృద్ధిని సైతం పాతాళంలోకి తొక్కేశారని విమర్శించారు.
ఉత్తరాంధ్ర భూములు కొట్టేయడానికే కపట ప్రేమ...
వైసీపీ నేతలు, ఉత్తరాంధ్ర మంత్రులు ఉత్తరాంధ్ర పై ప్రేమతో మాట్లాడడంలేదు. కేవలం ఉత్తరాంధ్ర భూములను కొట్టేయడానికే మీరు కపట ప్రేమ చూపిస్తున్నారని, చివరికి ప్రకృతి ఇచ్చిన రుషి కొండను సైతం కాజేస్తున్నారంటూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల పాదయాత్రకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ ఏపీ మంత్రులు అందుకు భిన్నంగా పాదయాత్రకు ఆటంకం కలిగించడానికి నిమిషాల సమయం చాలని వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. ఏపీ ప్రతిపక్ష నేతగా నాడు వైఎస్ జగన్ అమరావతి రాజధానికి అంగీకరించారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని గుర్తుచేశారు.
ఇటీవల సమావేశమైన వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు
Visakha YCP Leaders: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన అధికార వికేంద్రీకరణను ఉత్తరాంధ్ర ప్రజలు ముక్త కంఠంతో స్వాగతించారని అన్నారు ఉత్తరాంధ్ర వైసిపీ నేతలు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి ఎటువంటి ఉద్యమాలు చేయడానికైనా తామంతా సిద్ధంగా ఉన్నామని ఉత్తరాంధ్రకు చెందిన మేధావులు, ఉద్యోగులు, రచయితలు, కార్మిక సంఘాల నేతలు, వివిధ వర్గాలకు చెందిన నాయకులు స్పష్టం చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక గాదిరాజు ప్యాలస్ లో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్రంలోని ఐదు కోట్ల మందికి అభివృద్ధి ఫలాలు అందాలన్నది ఆయన ఆకాంక్ష అని అన్నారు.