AP News: నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులు, రోడ్లన్నీ బ్లాక్ - స్పందించిన నేపాల్ సర్కార్!
AP Latest News: వరదల వల్ల మూతబడ్డ రహదారులను నేపాల్ ప్రభుత్వం తక్షణం విస్తరణ పనులు చేపట్టడంతో తాము సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు యాత్రికులు తెలిపారు.
Floods in Nepal: ఏపీ నుంచి నేపాల్ పర్యటనకు వెళ్లిన పలువురు ఏపీ వాసులు అక్కడ వరదల్లో చిక్కుకుపోయారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలాల నుండి నేపాల్ పర్యటనకు ఈనెల మూడో తేదీన కురుపాం నుంచి 18 మంది, గుమ్మలక్ష్మీపురం నుంచి 5 మంది కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు బయలుదేరారు.
వీరు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుని అక్కడ నుండి నేపాల్ ముక్తినాదిని దర్శించుకోవడానికి బస చేయడానికి వెళ్లిన తర్వాత అక్కడికి చేరుకున్న తర్వాత రెండు రోజులుగా నేపాల్ లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తూ ఉండడం వలన నేపాల్ వరదలలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక రోజంతా నీరు, ఆహారం లేక చాలా ఇబ్బందులు పడ్డామని యాత్రికులు తెలిపారు. ఎవరికైనా ఫోన్ చేసి తమ పరిస్థితి తెలియజేద్దామన్నా సిగ్నల్స్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నామని యాత్రకు వెళ్లిన వారు చెబుతున్నారు.
శుక్రవారం సాయంత్రం నేపాల్ ప్రభుత్వం యాత్రలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు విస్తరణ పనులు చేయడం వలన బయటపడి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నామని తెలిపారు. గుమ్మలక్ష్మీపురం వాసులు ఓ మీడియా ప్రతినిధితో ఫోన్లో మాట్లాడి తమ పరిస్థితిని వివరించారు. తమతో వచ్చిన వాళ్లంతా సురక్షితంగా ఉన్నారని ఎవరు ఆందోళన చెందవద్దని యాత్రికులు తెలిపారు.