Gudivada Amarnath: సాహితీ ఫార్మా మృతుల కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం, రూ.25 లక్షల చెక్కులు అందజేత
Sahithi Pharma: సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఏపీ ప్రభుత్వం ఆదుకుంది. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు చొప్పున చెక్కులు అందించారు.
![Gudivada Amarnath: సాహితీ ఫార్మా మృతుల కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం, రూ.25 లక్షల చెక్కులు అందజేత AP Minister Gudivada Amarnath gives Rs 25 lakh exgratia checques to Sahithi Pharma victim Families Gudivada Amarnath: సాహితీ ఫార్మా మృతుల కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం, రూ.25 లక్షల చెక్కులు అందజేత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/638a26a68db8b7bf8a9ac04e9904f45d1690367385550233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rs 25 lakh checques to Sahithi Pharma victim Families:
'సాహితీ ఫార్మా' మృతుల కుటుంబాలను ఆదుకున్న ఏపీ ప్రభుత్వం
- ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల సహాయం అందజేసిన మంత్రి అమర్నాథ్
అనకాపల్లి: అచ్చుతాపురం ఫార్మాసిటీలో సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఏపీ ప్రభుత్వం ఆదుకుంది. సుమారు రెండు నెలల కిందట జరిగిన ప్రమాదంలో కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వెంటనే ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించడం తెలిసిందే. ఈ మొత్తాన్ని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు చొప్పున చెక్కులు అందించారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. సాహితీ ఫార్మా లో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే తాను విజయవాడ నుంచి హుటాహుటిన విశాఖ చేరుకున్నారని, క్షతగాత్రులను చూసిన తర్వాత ఇక్కడ పరిస్థితిని ముఖ్యమంత్రి వివరించగా ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారు కోలుకుంటారని భావించినా, ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నందువలన వారు మరణించారని అమర్నాథ్ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు, వారి కుటుంబాలలో ఒకరికి ఆ కంపెనీలోనే ఉద్యోగం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ రవి పటాన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.
అగ్నిప్రమాదంలో కార్మికుల మృతితో విషాదం
అనకాపల్లి జిల్లాలోని సాహితీ ఫార్మాలో సాల్వెంట్ రికవరీ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో 35 మంది కార్మికులు పని చేస్తుండగా.. దాదాపు ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో మార్గమధ్యంలో ఒకరు, చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మిగిలిన బాధితులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా.. ఇద్దరు గాలిన గాయాలతో, కొన్ని అవయవాలు దెబ్బతినడంతో చనిపోయారు. ప్రమాద సమయంలో వచ్చిన పొగ పీల్చడంతో కార్మికులు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స అనంతరం కొందరు కోలుకుని డిశ్చార్జ్ కాగా, మరికొందరు ఇంకా కోలుకుంటున్నారు.
సాహితీ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కొన్ని రోజుల కిందటే ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అయితే దీనిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించారని, కానీ సాహితీ ఫార్మా ఘటనలో బాధితుల కుటుంబాలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని బుద్దా వెంకన్న ఇటీవల ప్రశ్నించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో ఫ్యామిలీకి సైతం కోటి రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)