ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఆవేశాన్ని చూపాలి- ముసుగులో గుద్దులాట లేదు: బొత్స
ఉత్తారంధ్ర ప్రజలు ఆవేశ పడాల్సిన టైం వచ్చిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి ఉద్యమం వెనుక ఉన్నది టీడీపీ అని తేలిపోయిందని అభిప్రాయపడ్డారు.
వికేంద్రీకరణ, అమరావతి ఉద్యమంపై మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేశ పడాలని పిలుపునిచ్చారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15న ఉదయం 9 గంటలకు విశాఖ గర్జన మొదలవుతుందన్నారు మంత్రి బొత్స. ఎల్‌ఐసీ కూడలి అంబేద్కర్ విగ్రహం నుంంచి బీచ్ రోడ్డు వరకు భారీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆవేశాన్ని వ్యక్తపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై ముసుగులో గుద్దులాట అవసరం లేదన్నారు. పాదయాత్ర వెనుక టీడీపీ ఉందనేది తేలిపోయిందని... తమ ఆకాంక్షలు చెప్పాలిసింది తామేనన్నారు.
టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కూడా మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంటే బరువు, పొడవు ఉన్నంత మాత్రాన అచ్చెన్నాయుడు జ్ఞాని అయిపోరని కామెంట్ చేశారు. తమను దద్దమ్మలు అంటున్న ఆయన ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అచ్చెన్న, ఆయన వారసులకు ఉత్తరాంధ్రలో ఆస్తులు, పదువులు కావాలి కానీ ఆ ప్రాంత అభివృద్ధి మాత్రం వద్దా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు భాషను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. టీడీపీ నేతలు సహనం కోల్పోయి మాట్లాడటం సరికాదన్నారు బొత్స.
వచ్చే సిరిమానోత్సవం నాటికి విశాఖ రాజధానిగా పరిపాలన ప్రారంభం అవుతుందని... అందుకు పైడి తల్లి అమ్మవారిని మొక్కుకుంటానన్నారు బొత్స. ఐదేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి పనులు అన్నీ అటకెక్కాయని విమర్శించారు. వైఎస్సార్ హాయాంలో చేపట్టిన ప్రాజెక్టులు కొనసాగిస్తున్నామన్నారు. దసపల్ల భూముల్లో చట్ట విరుద్ధంగా ఏమి జరగదని.. అందుకు తమ ప్రభుత్వం అంగీకరించదన్నారు.
తమపై విమర్శలు చేస్తున్న బీజేపీకి ఏపీలో ఉన్న స్థానం ఏంటని బొత్స ప్రశ్నించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పార్టీ బీజేపీకి వైసీపీని విమర్శించే అర్హత లేదన్నారు. బీజేపీకి ఏపీలో మనుగడ లేదని ఎద్దేవా చేశారు. తమకు ప్రజలు ఐదేళ్లు పరిపాలించమని తీర్పు ఇచ్చారని... ముందస్తు ఎన్నికలు ఉహాజనీతమని అభిప్రాయపడ్డారు చేతకాకపోతేనే ముందస్తుకు వెళ్ళాలని... తమది దమ్మున్న ప్రభుత్వమని తెలిపారు. అమరావతి దోపిడీ అన్నప్పుడు పవన్ కల్యాణ్‌కు అవగాహన లేదా అని ప్రశ్నించారు బొత్స.
పవన్‌పై విరుచుకుపడ్డ మంత్రులు, వైసీపీ లీడర్లు
ఈ ట్వీట్లపై మంత్రులు వరుస ప్రెస్‌మీట్లు పెట్టారు పవన్‌పై తీవ్రంగా విమర్సలు చేశారు.. పవన్ ట్వీట్లతో ప్రజలతో ఉన్నాను అనే భ్రమలో ఉన్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. షూటింగ్ గ్యాప్ లో ట్వీట్ లు చేయటం పవన్ కు అలవాటని వ్యాఖ్యానించారు. అంతే కాదు పవన్ కు రాజకీయ విలువలు లేవని ఫైర్ అయ్యారు. చంద్రబాబును నిలబెట్టుకోవాలని పవన్ తాపత్రయ పడుతున్నాడని, మా సామాజిక వర్గం వ్యక్తి ఇలా చేయడం చాలా బాధగా ఉందని కొట్టు సత్యనారాణ ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు చెంచా అంటూ విమర్శలు చేశారు. పవన్ ఉండేది హైదరాబాద్‌లో షూటింగ్స్ విదేశాల్లో ఏపీలో పరిస్థితులు ఏం తెలుసని ప్రశ్నించారు. చంద్రబాబు ఏం చెబితే అది పవన్ ట్వీట్ చేస్తారని ఆరోపించారు. పవన్ ట్వీట్లు కూడా సినిమా డైలాగుల్లానే ఉంటాయన్నారు. 2024లో జనసేనను చంద్రబాబుకు అమ్మేడానికి పవన్ సిద్ధంగా ఉన్నారన్నారు. ట్విట్టర్‌లో కాదు పవన్ కల్యాణ్ కు దమ్ముంటే విజయవాడ రావాలని సవాల్ విసిరారు. పవన్‌ను ప్రశ్నించిన ప్రతి అంశంపై తాను చర్చకు సిద్ధమని మంత్రి జోగి రమేష్ అన్నారు.
ఏపీలో మూడు రాజధానులు, అందుకు మద్దతుగా ఏర్పాటు చేస్తున్న వరుస రౌండ్ టేబుల్ సమావేశాలు, 15న నిర్వహించబోయే విశాఖ గర్జన భారీ సభను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేసిన వేళ, ఏపీ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పవన్ కల్యాణ్ పై వరుస ట్వీట్లు చేస్తూ ఎద్దేవా చేశారు. ‘‘దత్త తండ్రి చంద్రబాబు తరఫున.. దత్త పుత్రుడి పవన్ కల్యాణ్ మియావ్ మియావ్...!’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ‘‘మియావ్.. మియావ్ దత్తపుత్రుడి పవన్ కల్యాణ్ త్రీ క్యాపిటల్స్ః 1 - అంతర్జాతీయ రాజధాని మాస్కో, 2 - జాతీయ రాజధాని ముంబాయి, 3 - పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్’’ అంటూ ఎద్దేవా చేశారు.