AP Farmers: ఏపీలో రైతుకు ఎకరానికి అదనంగా రూ.9000 ఆదాయం: మంత్రి కారుమూరి
తమ ప్రభుత్వ నిర్ణయాలతో రైతుకు ఎకరానికి అదనంగా రూ.9 వేల వరకు ఆదాయం చేకూరుతుందన్నారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు దళారి వ్యవస్ధ లేకుండా చేశామన్నారు.
విశాఖపట్నం: రాష్ట్రంలో రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధరను కల్పించడంతో పాటు ధాన్యం సేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని ఏపీ పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహరాల శాఖామంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. జి.వి.ఎం.సి మీటింగ్ హాల్ లో శుక్రవారం ఉదయం మీడియాతో సమావేశమైయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ నిర్ణయాలతో రైతుకు ఎకరానికి అదనంగా రూ.9 వేల వరకు ఆదాయం చేకూరుతుందన్నారు. రైతు క్షేమం కోసం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు దళారి వ్యవస్ధ లేకుండా చేశామన్నారు.
రైతులకు ఆన్ లైన్ ద్వారా నగదు..
ఆర్ బి.కె. సెంటర్ల వద్ద ఖాటా వేసి ధాన్యం ఏ రైతు వద్దనుండి మిల్లునకు చేరినది, ఏ మిల్లునకు ఏ రైతునకు సంబంధించిన ధాన్యం చేరినది అనే విషయాలను తెలియకుండా జాగ్రత్తలు వహించడం జరిగిందన్నారు. రైతులు ఆన్ లైన్ విధానం ద్వారా నగదు కోరుకొంటున్నారని, గతంలో రూ. 1200 ఉన్న మద్దతు ధర ప్రస్తుతం రూ.1530 చొప్పున నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఇందువల్ల రైతుకు ఎకరానికి సుమారు రూ.9000 అదనంగా ఆదాయం సమకూరిందన్నారు. ప్రస్తుత సంవత్సరం సకాలంలో వర్షాలు పడడంతో పాటు తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు లేనందువలన ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో నాణ్యతతో కూడిన అధిక పంట దిగుబడి జరిగిందన్నారు.
రాగులు, జొన్నలను కూడా రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారని ఇందుకోసం రైతులను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులు పండించిన రాగులు, జొన్నలు కూడా రైతుల నుండి పౌర సరఫరాల శాఖ కొనుగోలు చేసి పంపిణీకి చర్యలకు చేపడుతుందన్నారు. 16 మున్సిపాలిటీలలో పైలెట్ ప్రాజెక్టుగా గోదుమ పిండి పంపిణీ చేయుట ప్రారంభించామన్నారు. వినియోగ దారులు నష్టపోకూడదనే ఆలోచనతో పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, గోల్డు షాపులతో పాటు ఎరువుల దుకాణాలను తనిఖీ లు నిర్వహించి 555 కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు.
30 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
అంతకుముందు మంత్రి కారుమూరి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి మరియు అల్లూరి జిల్లాలకు సంబందించి జాయింట్ కలెక్టర్లు, డిఎస్ఓలు, డి.ఎం లు, లీగల్ మెట్రాలజీ మరియు ఎఫ్ సి ఐ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీప్ సీజన్ లో ఇప్పటివరకు 30లక్షల 19వేల 700 టన్నులు ధాన్యాన్ని సేకరించామని, దీని మొత్తం విలువ 6 వేల 165 కోట్ల రూపాయలని మంత్రి కారుమూరి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, పౌర సరఫరాల డైరెక్టర్ విజయ సునీత, సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జి.వీరపాండ్యన్, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్, అనకాపల్లి జాయింట్ కలెక్టర్, కె.కల్పనా కుమారి, విజయనగం జాయింట్ కలెక్టర్ కె.మయూరి అశోక్, పార్యతీపురం మన్యం జాయింట్ కలెక్టర్ ఓ ఆనంద్, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్, డి.ఎస్.ఓలు, డి ఎం లు, ఎఫ్ సి ఐ అధికారులు, తూనికలు కొలతల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.