Paderu Bus Accident: పాడేరు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా, బాధితులకు మంత్రి గుడివాడ పరామర్శ
Paderu Bus Accident: పాడేరు ఘాట్‌లో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ప్రదేశాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు.
Paderu Bus Accident: పాడేరు ఘాట్‌లో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ప్రదేశాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం రాత్రి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ఆర్టీసీ, పోలీస్ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఘటనపై సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు తీసుకోవాలని మంత్రి అమర్నాథ్‌ను ఆదేశించారు. హుటాహుటిన పాడేరు చేరుకున్న మంత్రి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్, కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించాలన్నారు. వారు పూర్తిస్థాయిలో కోలుకునే విధంగా వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.
అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ నుంచి పాడేరు వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిందని, ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారని, తీవ్రంగా గాయపడిన ఆరుగురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి లక్ష రూపాయలు చొప్పున అందిస్తామన్నారు. పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ అధికారులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ తో సహా 34 మంది బస్సులో ఉన్నారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన 32 మందిలో ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. మిగిలిన 26 మందిలో 21 మంది పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారందరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం చాలా వేగంగా స్పందించి సహాయ చర్యలు చేపట్టిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, పోలీసు యంత్రాంగం, డాక్టర్లను మంత్రి అభినందించారు.
పాడేరు ఘాట్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు లోయలో పడింది. పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొడుతూ 50 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 26 మందికి గాయాలయ్యాయి. బాధితులను వేర్వేరు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులు: నరవ నారాయణమ్మ(55) సబ్బవరం, సీసా కొండన్న (53) బర్సింగి
గాయపడిన వారు: సమాల లక్ష్మి (45), సమర్ల బాబురావు (48), బోండా రమణ (10), బోండా చిన్నమ్మలు (45), బోండా నారాయణరావు (45), బోండా దుర్గాభవాని (13), చిట్టిబాబు (45) కిల్లో బోడి రాజు (40)అగస్తి అప్పారావు (53) కిముడు సత్తిబాబు (38)ఆర్టీసీ డ్రైవర్, సల్ల పెంటమ్మ (50), తాంగుల జ్యోతి (38), కొర్రా బుంజు బాబు (50), వంతల కోటి బాబు (26), అర్లబు ప్రభ (30), కేఎస్ లక్ష్మణరావు (40) దేశిది గణపతి (40), గేమిలి వరహాలమ్మ (45), పాంగి తాతబాబు (50), బంటు రఘునాథ్ (40), కిముడు బోయిన కొండబాబు (26), నరవ ఈశ్వరరావు (60), పద్మ (23), సాయి మాధురి (24), S రవిబాబు (19), కిరసాని వెంకటేష్ (31)