AOB: 907 మంది మావోయిస్టు మిలీషియా, సానుభూతిపరుల లొంగుబాటు
907 Maoist supporters Surrender : ఏవోబీలో సుమారు 907 మావోయిస్టు సానుభూతిపరులు, మావోయిస్టు మిలీషియా సభ్యులు ఒడిశా పోలీసుల ఎదుట లొంగిపోయారు.
- ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో కీలక పరిణామం
- 907 మావోయిస్టు సానుభూతిపరులు, మావోయిస్టు మిలీషియా సభ్యుల లొంగుబాటు
- దుస్తులు పంపిణీ చేసి విందు ఏర్పాటు చేసిన పోలీసులు
- గంజాయి కేసులో తెలంగాణ ఇంజినీర్లు, బీటెక్ స్టూడెంట్ అరెస్ట్
- గంజాయి సరఫరా చేసిన ఒడిశాకు చెందిన వ్యక్తి అరెస్ట్
- కారు, 4 సెల్‌ఫోన్లు, గంజాయి స్వాధీనం చేసుకున్న సీలేరు పోలీసులు
907 Maoist supporters Surrender : ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో కటాఫ్ ఏరియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు 907 మావోయిస్టు సానుభూతిపరులు, మావోయిస్టు మిలీషియా సభ్యులు ఒడిశా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏవోబీలో చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో నక్కమామిడి, జంత్రి, ఆండ్రాపల్లి, పనస్‌పుట్, జొడొంబో, గజ్జెల మామిడి పంచాయతీలు, ఆంధ్రా లోని కుముడ, బుంగాపుట్ పంచాయతీల పరిధిలో ఉన్న పలు గ్రామాలకు చెందిన మావోయిస్టు సానుభూతిపరులతో పాటు మావోయిస్టు మిలీషియా సభ్యులు సుమారు 907 మంది మల్కన్‌గిరి ఎస్పీ నితీష్ వాద్వానీ, బీఎస్ఎఫ్ డీఐజీ ఇతర సీనియర్ పోలీసు అధికారులు ఎదుట లొంగిపోయారు. ఇందులో 467 మంది మిలీషియా సభ్యులు కాగా, మిగతావారు మావోయిస్టు సానుభూతిపరులు అని సమాచారం.
లొంగిపోయిన వారంతా గతంలో అనేక ఎదురుకాల్పుల్లో, ఇన్‌ఫార్మర్ హత్యలతో పాటు మావోయిస్టు కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు. మావోయిస్టులు తమను హింస వైపు మళ్లించారని ఈ సందర్బంగా గిరిజనులు విలేకరులతో పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు చూసి తాము జనజీవన స్రవంతిలోకి రావడానికి ఇష్టపడ్డామని లొంగిపోయిన వారు పేర్కొన్నారు. ఈ సందర్బంగా మావోయిస్టు ముఖ్యనేతల చిత్రాలతో ఉన్న కరపత్రాలతో వారు కనిపించారు. మావోయిస్టు నేతలు మీరు లొంగిపోండి అంటూ అందులో పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి పోలీసులు దుస్తులు పంపిణీ చేయడంతో బాటు వారికి మంచి విందు ఏర్పాటు చేశారు.
గంజాయి తరలిస్తున్న ఇంజినీర్లు అరెస్ట్
Engineers from Telangana Arrested at Sileru In Andhra Pradesh: ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ఇంజినీర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంజినీర్లకు గంజాయి సరఫరా చేసిన వ్యక్తితో సహా నలుగుర్ని సీలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. సీలేరు జెన్‌కో చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా వచ్చిన కారును తనిఖీ చేయగా, కారులో ప్యాకింగ్ చేసిన నాలుగు కేజీల గంజాయి పట్టుబడింది. వాహనంలో ఉన్న వారిని విచారిస్తే వీరు తెలంగాణకు చెందిన వారిగా గుర్తించారు. అరెస్టయిన వారిలో హైదరాబాద్ నగరంలో కూకట్‌పల్లిలో ఉంటున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, మరో బీటెక్ చదువుకున్న విద్యార్థి ఉన్నారు. వీరికి గంజాయి సరఫరా చేసిన ఒడిశాకు చెందిన వ్యక్తిని చాకచక్యంగా అరెస్ట్ చేసినట్లు సీలేరు పోలీసులు తెలిపారు. ఈ నలుగుర్ని అరెస్ట్ చేసి, వీరి వద్ద నుంచి కారు, నాలుగు సెల్ ఫోన్‌లు, గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీలేరు ఎస్ ఐ రామకృష్ణ (Sileru SI Ramakrishna) తెలిపారు.