Andhra University: ఏయూ వీసీని తక్షణమే రీకాల్ చేయాలి - రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్
అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలపై పలువురు మేధావులు, బాధితులతో కలిసి ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఎంతో ప్రతిష్ట కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చెల్లని రిజిస్టార్ సంతకంతో జరుగుతున్న ఏయూ స్నాతకోత్సవాన్ని తక్షణమే వాయిదా వేయాలని ఆంధ్ర యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పూర్వ విద్యార్థుల సమాఖ్య డిమాండ్ చేసింది. బుధవారం నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలపై పలువురు మేధావులు, బాధితులతో కలిసి ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్, టిడిపి నగర పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్, ఆచార్య కోటి జాన్ లు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా స్నాతకోత్సవం నిర్వహిస్తున్న ఏయు వీసీ ప్రసాద్ రెడ్డిని వెంటనే రీ కాల్ చేసి ఆంధ్ర యూనివర్సిటీని పరిరక్షించాలని కోరారు. ఉన్నత న్యాయస్థానం అడ్మిషన్ నిలుపుదల చేసిన పరిశోధక విద్యార్థులకు పీహెచ్డీ డిగ్రీల ప్రధానం చేస్తున్న ఏయూ యాజమాన్యంపై, అధికారుల మీద తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలన్నారు.
1400 పీహెచ్‌డీల అమ్మకాల మీద సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, ఉద్యోగ విరమణ వయస్సు 65ఏళ్ళు దాటినా రిజిస్ట్రార్ గా కొనసాగుతున్న ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. చట్ట వ్యతిరేకంగా చెట్లు నరికేసి, లక్షలాది రూపాయల కలపను అక్రమంగా తరలించిన వ్యవహారంలో అటవీ శాఖ కేసులు పెట్టిన ఏయూ అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పేరిట వ్యక్తిగత ప్రతిష్ట, పలుకుబడిని పెంచుకోవడానికి ఏయూ భూములు, భవనాలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసిన వీసీ ప్రసాద్ రెడ్డి మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అల్యుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు ఆచార్య కోటి జాన్ అధ్యక్షత వహించగా కార్యక్రమానికి వివిధ పార్టీలు సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్, సిపిఎం పార్టీ ప్రతినిధి జ్యోతిశ్వరరావు, సీపీఐ పార్టీ నగర కార్యదర్శి పైడి రాజు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి శీతల్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గుంప గోవింద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు, విదశం ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకటరావు, భీమ్ సేన వార్ అధ్యక్షులు చిన్నారావు, భారత్ బచావో కార్యదర్శి వేమన, ఐపిబిపి పార్టీ మహిళా కన్వీనర్ నిర్మల, కొత్తపల్లి వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ మహిళ పార్లమెంట్ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, తెలుగుదేశం మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈతలపాక సుజాత, విశాఖపట్నం బీసీ సెల్ కన్వీనర్ తమ్మిన విజయకుమార్, విశాఖ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జాన్, డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ జి కే డి ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీను, సిఐటియు మహిళ కార్యదర్శి మణి , ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొని ఏ యూ ఉపకులపతి అవినీతి అవకతవకలపై విచారణ జరిపి అతనిని వెంటనే తొలగించి ఏయూ ని కాపాడాలని తీర్మానించారు. ఏయు వద్ద అన్ని పార్టీలతో కలుపుకొని మహా ధర్నాకు పిలుపునిచ్చారు.