AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేయడానికి ఏపీ మంత్రులు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇవాళ మొదలయ్యే ఈ యాత్ర నాలుగు రోజులు సాగనుంది.
వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలో యాత్ర స్టార్ట్ కానుంది. ఇందులో మొత్తం 17 మంది మంత్రులు పాల్గొంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించనున్నారు.
నాలుగు రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు పాల్గొంటారు. ఇవాళ మొత్తం శ్రీకాకుళం, విజయనగరంలోజిల్లాల్లో పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొంటారు. రేపు విశాఖ ఇలా రోజుకో జిల్లాలో పర్యటించి ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తారు. నాలుగు రోజులు సాగే ఈ బస్సు యాత్ర విజయనగరం, రాజమండ్రి, నరసారావుపేట, అనంతపురం జిల్లాలో సాగనుంది.
బహిరంగ సభలు ఇవే
ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం జిల్లా ఏడు రోడ్ల కూడలిలో యాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు విజయనగరం రాజీవ్ గాంధీ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుంది. శుక్రవారం 9 గంటలకు విశాఖ పాత గాజువాక జంక్షన్ నుంచి రెండో రోజు యాత్ర స్టార్ట్ అవుతుంది. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద బహిరంగ సభ ఉంటుంది. మూడో రోజు అంటే శనివారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి గూడెంలో యాత్ర పునఃప్రారంభమవుతుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పల్నాడు బస్టాండ్‌లో బహిరంగ సభ ఉంటుంది. చివరి రోజు ఆదివారం.. నంద్యాల నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది. అదే రోజు సాయంత్ర నాలుగు గంటలకు అనంతపురంలోని మున్సిపల్ ఆఫీస్ సెంటర్‌లో భారీ బహిరంగ సభ ఉంటుంది. దీంతో యాత్ర ముగుస్తుంది.
యాత్ర సాగేదిలా
కాసేపట్లో శ్రీకాకుళం జిల్లా ఏడు రోడ్ల కూడలి నుంచి యాత్ర స్టార్ట్ కానుంది. వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి యాత్రను ప్రారంభిస్తారు మంత్రులు. తొలి రోజు యాత్ర ఎచ్చెర్ల, రణస్థలం మీదుగా విజయనగరం చేరుకుంటుంది. రేపు విశాఖలో సాగనుందీ యాత్ర. విశాఖలో గాజువాక, లంకెలపాలెంకూడలి, అనకాపల్లి జంక్షన్, తాళ్లపాలెం జంక్షన్, యలమంచిలి వై జంక్షన్, నక్కపల్లి, కత్తిపూడి, జగ్గంపేట మీదుగా రాజమండ్రిలోకి ఎంటర్ అవుతుంది. రాత్రికి తాడేపల్లిగూడెంలో బస చేస్తారు మంత్రులు. మూడో రోజు అంటే 28న ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను కవర్ చేస్తారు. ఆఖరి రోజు 29న కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలను కవర్ చేసి యాత్ర ముగిస్తారు.
ఈ బస్సు యాత్రలో మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాద రావు, బొత్స సత్యనారాయణ, వేణుగోపాల్, రాజన్నదొర, ముత్యాలనాయుడు, పినిపె విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, నారాయణ స్వామి, తానేటి వనిత, జోగి రమేష్, మేరుగ నాగార్జున, విడదల రజనీ, అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, ఉషశ్రీ చరణ్ పాల్గొంటారు.