Atchutapuram SEZ: అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి పరిహారం- 2 లక్షలు ప్రకటించిన కేంద్రం
Anakapalli: ఫార్మా ప్రమాద మృతులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వబోతున్నట్టు విశాఖ కలెక్టర్ హరిందర్ ప్రసాద్ ప్రకటించారు. చికిత్స పొందుతున్నవారికి కూడా గాయాల తీవ్రత బట్టి పరిహారం ఇస్తామన్నారు.
Vizag News: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా పరిశ్రమలో మృతు చెందిన వారిని భారీగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకే ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కోటి రూపాయల పరిహారం ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
కోటి పరిహారం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్ ప్రమాద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. జరిగింది ప్రైవేటు సంస్థలో ప్రమాదం అయినా భారీగా పరిహారం అందజేయాలని నిర్ణయించింది. సంస్థ సాయంతో సంబంధం లేకుండా ఒక్కొక్క మృతుడి కుటుంబానికి కోటి రూపాయల వరకు పరిహారం అందజేస్తున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు.
ప్రధాని దిగ్భ్రాంతి పరిహారం ప్రకటన
ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న ప్రధానమంత్రి మోదీ కూడా పరిహారం ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు లక్షలు ఇస్తున్నట్టు వెల్లడించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి యాభైవేలు ఇస్తామన్నారు. ఈ ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకొచ్చారు మోదీ. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
యాజమాన్యంపై కేసు
అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదానికి కారణమై 17 మంది మృతి చెందిన ఘటనలో కంపెనీపై కేసు నమోదు చేసినట్టు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బాధితులకు కంపెనీ నుంచి రావాల్సిన పరిహారం కూడా ఇప్పిస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు వివరించారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం వేరే ప్రాంతాలకి కూడా తరలించేందుకు ప్రభుత్వం సిద్ధంగాఉందని వెల్లడించారు.
క్షతగాత్రులకు 3 ఆసుపత్రుల్లో చికిత్స
అచ్యుతాపురం ప్రమాదంలో 17 మంది చనిపోగా... ఇంకా 40 మంది వరకు గాయపడినట్టు సమాచారం. వారిని మూడు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో 18 మందికి వైద్యం చేస్తున్నారు. అచ్యుతాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 10 మంది, విశాఖపట్నంలోని మెడికవర్‌లో ఏడుగురికి చికిత్స పొందుతున్నారు.