Visakha Fishing Harbor Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి - విచారణకు ఆదేశం, యూట్యూబర్ కోసం గాలిస్తున్న పోలీసులు
Visakha News: విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద దుర్ఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.
Visakha Fishing Harbor Accident: విశాఖలో ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, కారణాలు అన్వేషించాలని నిర్దేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, వారికి తగు సహాయం చేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా, ఆదివారం అర్దరాత్రి జరిగిన ప్రమాదంలో 60కి పైగా బోట్లు దగ్ధం కాగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అప్రమత్తం అయినప్పటికీ ఆస్తి నష్టాన్ని తగ్గించలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 4 ఫైరింజన్లు, ఓ ఫైర్ టగ్ నౌకతో మంటలు అదుపులోకి తెచ్చారు. బోట్లలో ఉండే ఇంధనంతో మంటలు మరింత వ్యాపించాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలువురు బోట్లను సముద్రంలోకి తీసుకెళ్లడంతో కొంత నష్టం తగ్గిందని పలువురు పేర్కొంటున్నారు.
#WATCH | Andhra Pradesh: A massive fire broke out in Visakhapatnam fishing harbour. The fire that started with the first boat eventually spread to 40 boats. Several fire tenders reached the spot to control the fire. Police have registered a case and are investigating the matter.… pic.twitter.com/1ZYgiWInOz
— ANI (@ANI) November 20, 2023
మత్స్యకారుల ఆందోళన
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంతో స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదంలో జీవనాధారమైన తమ బోట్లు దగ్ధం కావడంతో బోరున విలపించారు. ఒక్కో బోటు ఖరీదు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఉంటుందని రూ.కోట్లల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదాలు చూడలేదని చెప్పారు. ఈ క్రమంలో ఫిషింగ్ హార్బర్ ప్రధాన గేటు వద్ద నిరసన చేపట్టారు. ప్రమాద స్థలాన్ని సీఎం సందర్శించి తమకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రమాదానికి అదే కారణమా.?
కాగా, అగ్ని ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాత్రి ఫిషింగ్ హార్బర్ లో ఓ యూట్యూబర్ మద్యం పార్టీ ఏర్పాటు చేసి, మద్యం మత్తులో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బోటుకు నిప్పు పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న సదరు యూట్యూబర్, అతని స్నేహితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. వారిని పట్టుకుని విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో సీసీ కెమెరాల ద్వారా మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులు ఎంతటివారైనా వదిలి పెట్టమని, ఆస్తి నష్టంపై పూర్తి స్థాయి అంచనా వేస్తున్నట్లు జేసీ తెలిపారు.
Also Read: Vijayawada News: జాతీయ రహదారిపై కార్ల రేసింగ్ - ముక్కలైన స్కూటీలు, గాల్లోకి ఎగిరిపడ్డ యువకులు