Minister Gudivada Amarnath : అమరావతి పెయిడ్ ఆర్టిస్టులు పాదయాత్ర విరమించాలి- మంత్రి అమర్ నాథ్
Minister Gudivada Amarnath : అమరావతి పెయిడ్ ఆర్టిస్టులు పాదయాత్ర విరమించాలని మంత్రి అమర్ నాథ్ కోరారు.
Minister Gudivada Amarnath : వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15వ తేదీన నిర్వహించే విశాఖ గర్జనను విజయవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. మద్దిలపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంత్రి అమర్నాథ్ , మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆదివారం సమావేశమై గర్జన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ గర్జనకు రైతుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందన్నారు. సోమవారం రైతులు విశాఖకు వచ్చి వారి మద్దతు తెలియజేస్తారని ఆయన చెప్పారు. అలాగే బార్ అసోసియేషన్, ట్రేడ్ యూనియన్స్, నర్సింగ్ స్టాఫ్, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు విశాఖ గర్జనకు మద్దతు తెలియజేశారని అమర్నాథ్ వివరించారు.
పెయిడ్ ఆర్టిస్టుల యాత్ర విరమించాలి
మూడు రాజధానులతో మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి అమర్నాథ్ పునరుద్ఘాటించారు. విశాఖ గర్జనను విజయవంతం చేసి, విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను, రాష్ట్రం నలు దిక్కులకు తెలియజేయాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా రైతుల పాదయాత్ర పేరుతో పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న యాత్రను విరమించుకోవాలని, యాత్ర విరమించుకునే వరకు విజ్ఞప్తి చేస్తూనే ఉంటామన్నారు. ఈ యాత్రకు కర్త-కర్మ-క్రియ అయినడిపిస్తున్న చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితులను గ్రహించి యాత్రను విరమింపచేయాలని సూచించారు. విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీ అని ప్రముఖులు ఏనాడో గుర్తించారని, అన్ని రకాల అవకాశాలున్న విశాఖ నగరాన్ని రాజధానిగా చేయడానికి చంద్రబాబు ఎందుకు అంగీకరించడంలేదో చెప్పాలని ప్రశ్నించారు.
బీజేపీ, టీడీపీకి ఉత్తరాంధ్ర అంటే చులకన
వికేంద్రీకరణకు మద్దతుగా ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలపై తెలుగుదేశం, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యల పట్ల అమర్నాథ్ స్పందిస్తూ ఉత్తరాంధ్ర ప్రజలన్నా, ప్రజాప్రతినిధులన్నా, ఈ రెండు పార్టీల నాయకులకు చులకన అన్నారు. చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఆ రాష్ట్రాల్లో కొత్తగా రాజధానులు నిర్మించలేదన్నారు. ఉన్న నగరాలను అభివృద్ధి చేసి రాజధానులుగా కొనసాగిస్తున్న విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న టీడీపీ, బీజేపీ అధినాయకులకు ఆ పార్టీలకు చెందిన ఈ ప్రాంత నాయకులు ఎలా ఊడిగం చేస్తున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు.
చంద్రబాబు డైరెక్షన్ లో పాదయాత్ర
విశాఖ రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో టీడీపీ నేతలు ప్రజలకు చెప్పాలని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు. జేఏసీ కార్యాచరణకు అనుగుణంగానే విశాఖ గర్జన ర్యాలీ జరుగుతుందని తెలిపారు. రైతు సంఘాలు, విద్యార్థులు, న్యాయవాదులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారని తెలిపారు.టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లోనే అమరావతి పాదయాత్ర నడుస్తోందని ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులు తమ యాత్రను విరమించుకోవాలని మంత్రి కోరారు. అని స్పష్టం చేశారు.
Also Read : Kanaparthi News: కనపర్తి వాసుల నిరసన, ఎమ్మెల్యే గారు మా ఊరికి రావొద్దంటూ ప్లకార్డులు!
Also Read : సీఎం జగన్‌పై యనమల విమర్శలు - పిల్లి శాపాలు అంటున్న ఆర్థిక మంత్రి బుగ్గన