సీఎం జగన్‌పై యనమల విమర్శలు - పిల్లి శాపాలు అంటున్న ఆర్థిక మంత్రి బుగ్గన
ఏపీ సీఎం జగన్ పాలనపై దుమ్మెత్తి పోయడం చూస్తే పిల్లి శాపాలు అనే సామెత గుర్తుకు వస్తోందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన సభా వ్యవహారాల శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు.
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై దుమ్మెత్తి పోయడం చూస్తే పిల్లి శాపాలు అనే సామెత గుర్తుకు వస్తోందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన సభా వ్యవహారాల శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు’ అనేది యనమల మాటలకు అక్షరాలా సరిపోతుందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి ప్రజలకు విరివిగా సంక్షేమ పథకాల ఫలాలు అందడంతో పాటుగా రాష్ట్రమంతటా యావత్ రైతాంగం పచ్చగా ఉంటే యనమల ఓర్వ లేక పోతున్నారని బుగ్గన ఫైర్ అయ్యారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ప్రజా సంక్షేమ పథకాలు ఏపీ ప్రజలకు అంది, వారి అవసరాలు తీరుతుంటే అది చూసి ఓర్వ లేక యనమల, ఇతర టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. కొన్ని నెలల కిందటి వరకూ ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా మారబోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నేతలు గగ్గోలు పెట్టారని, ఇపుడేమో నైజీరియా, జింబాబ్వే అంటూ నానా యాగీ చేస్తున్నారని ఆయన కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ నేతల దృష్టి మొత్తం ప్రపంచంలో ఎక్కడ వికృత చేష్టలు చేసుకుంటున్నాయో, ఎక్కడెక్కడ అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయో అక్కడే ఉంటున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.
సానుకూల దృక్పథం అనేది వారి డిక్షనరీ లోనే ఉన్నట్లుగా లేదని బుగ్గన అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పనిలో నిరంతరం వైసీపీ ప్రభుత్వం నిమగ్నమై ఉంటే మా పై రాళ్లేయడమే ఈ బ్యాచ్ పనిగా కనిపిస్తోందన్నారు. ఏఏ దేశాల్లో పరిస్థితులు బాగోలేవో మరీ వెతికి పట్టుకుని అలాంటి పరిస్థితులే ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తాయని, ప్రజలు నానా అగచాట్లు పడాలని టీడీపీ నేతలు నిరంతరం కోరుకుంటున్నట్లుగా ఉందన్నారు. అందుకే నోటికొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని బుగ్గన అన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా సాయం అందిస్తూనే మరో వైపు అభివృద్ధి వైపు మేము దృష్టి సారిస్తూ ఉంటే శాపనార్థాలు పెట్టడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారంటూ ఆర్థిక మంత్రి బుగ్గన మండిపడ్డారు.
టీడీపీ హయాంలో అప్పులు అసాధారణం
ఐదేళ్ళ టీడీపీ హయాంలో (2014-19) చేసిన అప్పులు 19.6% పెరిగితే, వైస్సార్సీపీ హయాంలో (2019-22) మూడు సంవత్సరాలలో, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు తీసుకున్న అప్పులతో కలుపుకొని చేసిన అప్పులు ( రెండు సంవత్సరాల కోవిడ్ కష్టాలను ఎదుర్కొని కూడా) 15.5% మాత్రమే పెరిగాయని వెల్లడించారు. ఐదేళ్ల టీడీపీ హయాం లో (2014-19) ఏ రకమైన ఆర్ధిక ఇబ్బందులు లేకుండా కూడా 19.6% వృద్ధితో అప్పు చేశారని గుర్తు చేశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అమలు చేసిన ఆర్ధిక విధానాలతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వంలో ఆర్ధిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉందని, సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటిని, ఎన్ని ఇబ్బందులున్నా వీటిని సమన్వయం చేస్తూ వైస్సార్సీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో 2014 -19 లో కేంద్ర ప్రభుత్వ సంయోజిత వార్షిక ఎదుగుదల రేటు (CAGR) 9.89 % పెరిగినప్పుడు, మన రాష్ట్ర CAGR 16.80% పెరిగింది. అదే వైసీపీ ప్రభుత్వ హయాం లో కేంద్ర ప్రభుత్వ CAGR 14.37% పెరిగిన కూడా మన రాష్ట్ర CAGR 13.28% మాత్రమే పెరిగిందని వివరించారు. CAG నివేదికలో టీడీపీ పాలనలో జరిగిన ఆర్థిక ఉల్లంఘనలు, అవకతవకలు ఉన్నాయని, టీడీపీ పాలనలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ. 17,000 కోట్లు అదనంగా అప్పు చేస్తే దానిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించి తీవ్రంగా తప్పుబట్టిందని తెలిపారు. టీడీపీ పాలనలో అతిక్రమించి చేసిన అదనపు అప్పులను ఒక కారణంగా చూపి, ఇపుడు మా పాలనలో అప్పులు చేయరాదని నిర్దేశించిందన్నారు.