Kanaparthi News: కనపర్తి వాసుల నిరసన, ఎమ్మెల్యే గారు మా ఊరికి రావొద్దంటూ ప్లకార్డులు!
Kanaparthi News: ఎమ్మెల్యే గారు.. మా ఊరికి రావొద్దంటూ ప్రకాశం జిల్లా కనపర్తి వాసులు నిరసన చేపట్టారు. గ్రామ శివారులోని రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యేను గ్రామంలో అడుగు పెట్టనీయకుండా చేశారు.
Kanaparthi News: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే గారు మా ఊరికి రావొద్దంటూ ప్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. సంతనూతనలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో శనివారం గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు, పలువురు గ్రామస్థులు కలిసి.. ఊరకి వచ్చే రహదారిపై నల్ల జెండాలు పట్టుకొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మాయ మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. రాపర్ల - చవటపాలెం రోడ్డు దెబ్బ తనిడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కనీసం గ్రావెల్ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.
కుక్కలవారిపాలెం - కనపర్తి దారిలో బకింగ్ హోం కాలువపై వంతెన నిర్మాణం కూడా కేవలం హామీలపై పరిమితం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల తరఫున ఉండి మాట్లాడాలల్సిన గ్రామ సచివాలయ సిబ్బంది.. ఊళ్లోని ఓ నాయకుడి కనుసన్నల్లో పని చేస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ గ్రామంలో చేపట్టాల్సిన గడప గడపకు కార్యక్రమం పలు కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం వర్షం కారణంగా మరోసారి వాయిదా వేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ నిరసన సెగ తగులుతుందన్న కారణంగానే ఎమ్మెల్యే ఇటు వైపు రావడం లేదని గ్రామస్థులు వివరిస్తున్నారు.
గడపగడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా తమ నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్తున్న ప్రజా నిధులకు అక్కడక్కడా జనం నుంచి వ్యతిరేకత ఎదురవుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఎన్నో వైరల్ అవుతున్నాయి. తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఎప్పటిలాగే ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు ఊహించని ఘటన ఎదురైంది.
ఇటీవలే ఎమ్మెల్యే కేతిరెడ్డికి కూడా షాక్..
కొండన్న గారి శివయ్య అనే వ్యక్తి ఎమ్మెల్యే కేతిరెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు. తాడిమర్రి మండలం ఎం.అగ్రహారంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన టీడీపీ జెండాను చూసి.. ‘‘మేం వస్తున్నామని జెండాలు కట్నారా..ఏమి’’ అని కేతిరెడ్డి సరదాగా అన్నారు. అలా కొండన్న గారి శివయ్య కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి వ్యక్తిగతంగా లభించిన లబ్ధి వివరాల బ్రోచర్ ను ఎమ్మెల్యేకు ఇవ్వబోయారు. అయితే ‘నీ పథకాలు అవసరం లేదు’ అంటూ శివయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ముఖంపైనే తిరస్కరించారు. దీంతో కేతిరెడ్డి తీసుకోమని మరోసారి కోరారు. అయినా వారు వినకపోవడంతో ఎమ్మెల్యే వెనుదిరిగారు.
వారికి పథకాలు పీకేసిన ఎమ్మెల్యే?
అలా వెళ్తూ అక్కడే గ్రామ వాలంటీర్ మమతను పిలిచి.. ‘‘ఏమ్మా వారికి పథకాలు ఏమీ వద్దంటా.. వాళ్లు అంత ఇబ్బంది పడుతుండగా బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు? తీసేయండి. వాళ్ల బదులు మరెవరికైనా సాయం చేయవచ్చు కదా? అని అన్నారు. ఇంతలో ఆ కుటుంబంలో వ్యక్తి ఎమ్మెల్యే వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా.. ‘పథకాలు వద్దన్నారుగా.. తీసేస్తాంలే’ అని ఎమ్మెల్యే అన్నారు. దీంతో ఆ కుటుంబానికి సంక్షేమ పథకాలను తీసేయించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌గా మారింది.