500 ఏళ్ల నాటి ఆలయం కోసం పోరాటం: గుప్త నిధుల వేటగాళ్ల బారిన పడిన శివాలయాన్ని కాపాడాలని సీఎం చంద్రబాబుకు అభ్యర్ధన!
Shiva Temple : "సీయం గారూ.. మా గుడిని బాగు చేయరూ"...500 ఏళ్ల నాటి గుడి కోసం పోరాడుతున్న ఊరు. వారి అభ్యర్థన పరిగణలోకి తీసుకుంటారా?

Sri Sathyasai District News: " 500 ఏళ్ల నాటి మా ఊరి గుడిని కాపాడండి " అంటూ ఆ గ్రామస్తులు పోరాడుతున్నారు. అధికారుల నుంచి సీయం వరకూ అందరకీ విజ్ఞప్తులు చేస్తూ తిరుగుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గొరవన హళ్లి గ్రామంలోని పురాతన శివాలయాన్ని గుప్త నిధుల వేటగాళ్ల నుంచి కాపాడాలని ఆలయాన్ని తిరిగి పునఃనిర్మించాలని ఆ ఊరి ప్రజలు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

విజయనగర రాజులు నిర్మించిన శివాలయం -ఇక్కడి శివలింగం చాలా ప్రత్యేకం
పరిగి మండలం గొరవనహళ్లి గ్రామం హిందూపూర్ కు పది కిలోమీటర్ల లోపే ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ ప్రవహించే జయమంగళి నది తీరంలో విజయనగర రాజులు 16వ శతాబ్దం లో ఈ శివాలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడకు దగ్గరలో ఉన్న లేపాక్షి ఆలయం నిర్మాణం సమయంలోనే దీనినీ నిర్మించారు. ఆ కాలంలో ఇక్కడ సాంస్కృతిక ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగేవని ఆలయ ప్రాంగణం లోని శాసనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆలయంలో శివలింగం చాలా ప్రత్యేకమైనదని గొరవనహళ్లి గ్రామస్తులు చెబుతున్నారు. బ్రహ్మ సూత్రంతో ఉండే శివలింగాలు చాలా అరుదని ఇక్కడి ఆలయం లోని లింగం ఆ కోవకు చెందినదే అంటున్నారు. ఈ గుడి పక్కనే లక్కమ్మ ఆలయం ఉంది

గుప్త నిధుల వేటగాళ్ల బారిన పడిన శివాలయం
కాలక్రమంలో జయమంగళి నదీ ప్రవాహం వల్ల గుడి కొంత దెబ్బ తినగా... గుప్త నిధుల వేట గాళ్ళ వలన మరింత శిధిలావస్థకు చేరింది. నిధుల కోసం ఒకటికి రెండుసార్లు లింగాన్ని తవ్వే ప్రయత్నం చేశారు దుండగులు. అలాంటి సమయాల్లో గ్రామస్తులే శివలింగాన్ని మళ్ళీ ప్రతిష్టించారు. నిత్యం పూజలు చేస్తున్నారు

సీయం గారూ..మా గుడిని బాగు చేయరూ : గ్రామస్తుల విజ్ఞప్తి
గౌరవనహళ్లి గ్రామం లోని ఈ పురాతన శివాలయంలో నాటి శిల్ప సౌందర్యం, ప్రాంగణం, ప్రాకారాలు, ఉయ్యాల మంటపం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటాయి. ఆలయాన్ని పునరుద్దరణ చేయాలనే ఉద్దేశ్యంతో ఇటీవల వైశాఖ మాస ఏకాదశ మహా రుద్రాభిషేక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 1500మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఇప్పటికే సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ కు గుడిని పునరుద్దరించాలంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేసారు. దానికి అయ్యే ఖర్చుల్లో కొంత భాగం తాము భరిస్తామంటూ కలెక్టర్ కు తెలిపారు. మరోవైపు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో సీయం చంద్రబాబు నాయుడు ని సీనియర్ జర్నలిస్ట్ సౌజన్య ద్వారా కలిసి గుడి అభివృద్ధి గురించి కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు ఆమె తెలిపారు.

గుడి అభివృద్ధి కోసం తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని ఓ వైపు అధికారులకు విన్నవించుకుంటూ.. ఆ పరమేశ్వరుడి కరుణ తమపై ఉండాలని ప్రార్థిస్తున్నారు గొరవన హళ్లి గ్రామస్తులు ..

ఓం నమఃశివాయ..
శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి





















