Pneomonia Awareness: 'అవగాహన, ముందస్తు పరీక్షలే న్యుమోనియా నివారణ మార్గాలు' - కొవిడ్ తో సవాళ్లు పెరిగాయంటున్న వైద్య నిపుణులు
Vijayawada News: న్యూమోనియా సమస్య నివారణకు అవగాహన, ముందస్తు పరీక్షలే ప్రధాన మార్గాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గుత్తా లోకేష్ స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి పలు కీలక సూచనలు చేశారు.
Doctor Lokesh Awareness on Pneomonia: న్యుమోనియా.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది. ముఖ్యంగా పిల్లలతో పాటు వృద్ధుల్లోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో దీని బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. వైద్య నిపుణులు ప్రతి ఏడాది ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా మార్పు రావడం లేదు. విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి చెందిన ప్రఖ్యాత నిపుణుడు డాక్టర్ గుత్తా లోకేష్ (Gutta Lokesh) న్యూమోనియా (Pneomonia) సమస్య నుంచి బయటపడేందుకు, దీని బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు చేశారు.
ముందస్తు పరీక్షలే మార్గం
న్యుమోనియా పసి పిల్లల నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసుల వారిని ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యాధిని ఎదుర్కోవాలంటే ముఖ్యంగా దీనిపై అవగాహన కలిగి ఉండాలని వైద్య నిపుణులు గుత్తా లోకేష్ సూచిస్తున్నారు. 'చాలామందిలో ఈ సమస్య తొందరగా బయటపడదు. దీన్ని గుర్తించేందుకే సమయం పడుతుంది. ముందస్తు పరీక్షల ద్వారానే దీన్ని గుర్తించవచ్చు. దీంతో పాటు సరైన మెడికేషన్ తీసుకోవడం వల్ల దీన్ని సమర్థంగా నిరోధించవచ్చు.' అని పేర్కొన్నారు.
జ్వరం వంటి సాధారణ లక్షణాలపై అవగాహన, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి న్యుమోనియా సమస్యకు ప్రారంభ దశలో ఉంటాయని, ఈ దశలోనే మెరుగైన చికిత్స తీసుకుంటే మంచిదని చెప్తున్నారు డాక్టర్ లోకేష్.శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు న్యుమోనియా సమస్యకు కీలకంగా మారుతాయని చెబుతున్నారు. 'బ్యాక్టీరియా, వైరస్ లేదా శిలీంధ్రాల ద్వారా ఈ శ్వాసకోశ సమస్యలు మరింత జటిలమయ్యే సమస్య కూడా ఉందని, దీన్ని ముందస్తుగా గుర్తించాలని పేర్కొంటున్నారు. ముందస్తు రోగ నిర్ధారణ, తగు చికిత్స తీసుకుంటే న్యుమోనియా తగ్గుముఖం పడుతుందని స్పష్టం చేస్తున్నారు.
నివారణ మార్గాలు
న్యుమోనియా సమస్య తగ్గడానికి టీకాలు వేయడం అత్యంత ముఖ్యమని డా.గుత్తా లోకేష్ పేర్కొంటున్నారు. న్యుమోకాకల్ వ్యాక్సిన్, ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ వంటి టీకాలు న్యుమోనియాను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అవి రోగిని రక్షించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతాయని చెబుతున్నారు. అంతే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి, పరిశుభ్రత పద్ధతులను పాటించడం ద్వారా కూడా న్యుమోనియా నుంచి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన నిద్ర వంటి వాటి వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరిగి, ఇన్ఫెక్షన్లు నివారించొచ్చని అంటున్నారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని, దీని వల్ల సూక్ష్మ క్రిములు నివారించవచ్చని చెబుతున్నారు.
రోగ నిర్ధారణ, చికిత్స
న్యుమోనియా సంబంధిత అనారోగ్యం, మరణాలను తగ్గించడంలో సకాలంలో రోగ నిర్ధారణ కీలకమని డాక్టర్ లోకేష్ స్పష్టం చేస్తున్నారు. అధిక జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని, తగు పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. దీని ద్వారా రోగులు త్వరగా న్యుమోనియా నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.
కొవిడ్ (Covid 19)తో పెరిగిన సవాళ్లు
కొవిడ్ మహమ్మారి కారణంగా న్యుమోనియాతో సహా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన సవాళ్లు పెరిగాయని డాక్టర్ గుత్తా లోకేష్ పేర్కొన్నారు. 'కొవిడ్, న్యుమోనియా లక్షణాలు చాలా వరకు ఒకేలా ఉంటాయి. ఇది రోగనిర్ధారణ సవాళ్లకు దారి తీస్తుంది. మీరు పరీక్షలు చేయించుకోవడం, ఏదైనా పరిస్థితిని సూచించే లక్షణాలను కలిగి ఉంటే డాక్టర్లను సంప్రదించడం చాలా ముఖ్యం' అని స్పష్టం చేశారు. కరోనాకు వ్యతిరేకంగా టీకాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు.
Also Read: Heavy Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులపాటు భారీ వర్షాలు-రెండో ప్రమాద హెచ్చరిక