Palaniswami in Vijayawada: ఏపీలో తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి - విజయవాడ దుర్గమ్మ దర్శనం
తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి ఏపీలో పర్యటిస్తున్నారు. విజయవాడ వచ్చిన ఆయన... ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు.
తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత పళనిస్వామి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన పళనిస్వామి.. ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పళనిస్వామికి ఘనస్వాగతం పలికారు దుర్గగుడి ఆలయ అధికారులు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఆయనకు అందించారు ఆలయ అధికారులు.
విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు పళనిస్వామి. అమ్మవారి దర్శనం కోసం మాత్రమే విజయవాడ వచ్చాన్నారు. పవిత్రమైన ఆలయంలో రాజకీయాలు మాట్లాడనని ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా ఎన్డీఏతో అన్నాడీఎంకే తెగదెంపుల విషయంపై అస్సలు మాట్లాడబోనని తేల్చి చెప్పారు.
తమిళనాడులో మాజీ సీఎం జయలలిత కన్నుమూసిన తర్వాత అన్నాడీఎంకే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరైంది.. గత ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు కలిసి పనిచేశాయి. అయితే.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై తీరు.. అన్నాడీఎంకేకు మింగుడుపడటం లేదు. అన్నాదురై, జయలలితపై అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. క్షమాపణలు చెప్పేందుకు కూడా నిరాకరించారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో,... ఎన్డీయే నుంచి బయటికి రావాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది అన్నాడీఎంకేకు. దీంతో... ఎన్డీయే కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది అన్నాడీఎంకే. ఆ ప్రకటన తర్వాత... తమిళనాడులో అటు అన్నాడీఎంకే, ఇటు బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. విజయవాడ వచ్చిన పళనిస్వామిని... ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయడంపై మీడియా ప్రశ్నించగా... ఆలయంలో రాజకీయాలు మాట్లాడేది లేదని చెప్పి దాటవేశారు పళనిస్వామి.