Vijayawada Latest News: విజయవాడలో 5 నెలల శిశువుకు విజయవంతంగా లివర్ మార్పిడి
Vijayawada Latest News:విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో ఓ ఐదు నెలల చిన్నారికి విజయవంతంగా లీవర్ మార్పిడి చికిత్స చేశారు. తల్లి నుంచి లీవర్ తీసుకొని దాన్ని చిన్నదిగా చేసి పసికందుకు అమర్చారు వైద్యులు.

Vijayawada Latest News: విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో ఓ ఐదు నెలల చిన్నారికి విజయవంతంగా లీవర్ మార్పిడి చికిత్స చేశారు. సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ ట్రాన్స్‌ప్లాంట్ కార్యక్రమానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్‌లో కేవలం 5 నెలల పసికందుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. గడిచిన మూడేళ్ళలో, ఈ ప్రోగ్రామ్ ద్వారా 10 మందికిపైగా పిల్లలకు లివర్ మార్పిడి జరిగిందని వెల్లడించింది. ఇందులో 90 శాతానికిపైగా ఆపరేషన్‌లు విజయవంతమైనట్టు తెలిపారు.
ఈ సందర్భంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ మాట్లాడుతూ... “పిల్లల్లో లివర్ మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు, సర్జరీ ఒక్క విషయంలోనే కాదు, లివర్ అనస్తీషియా, పిల్లల ఇంటెన్సివ్ కేర్ ఇలా అన్నింట్లోనూ అత్యంత నైపుణ్యం కావాలి. అన్నీ సమన్వయం చేసుకోవాలి. దేశంలో ఇలాంటి సెంటర్లు 5-7 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వాటిలో ఒకటిగా నిలిచింది” అన్నారు.
డాక్టర్ చెరియన్ ఏడేళ్ళ క్రితమే హైదరాబాద్‌లోనే అతి పిన్న వయసు గల శిశువుకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ఘనత కలిగి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి లివర్ ట్రాన్స్‌ప్లాంట్, ఉస్మానియా ఆసుపత్రిలో మొదటి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా ఆయనే చేశారు. ఈసారి, తల్లి ఇచ్చిన లివర్‌ను ప్రత్యేకంగా చిన్నదిగా మార్చి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది, ఎందుకంటే పసి బిడ్డ పొట్ట అతి చిన్నదిగా ఉండటంతో సాధారణ పద్ధతిలో అమర్చడం సాధ్యపడదు.
2022లో ప్రారంభమైన మణిపాల్ హాస్పిటల్ విజయవాడ-సౌత్ ఏషియన్ లివర్ సర్జరీ ప్రోగ్రామ్, గత మూడేళ్ళుగా రాష్ట్రంలో అగ్రగామి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌గా అవతరించింది. “ఇక్కడ మరో చిన్నారి విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. లివర్ మొత్తం వ్యాపించిన హెపటోబ్లాస్టోమా అనే క్యాన్సర్ కారణంగా ఆ శిశువుకి ఆపరేషన్ పని చేయదన్నారు. కానీ కీమోథెరపీతోపాటు ట్రాన్స్‌ప్లాంట్ చేసి, ఆ బిడ్డను మళ్ళీ ఆరోగ్యవంతంగా చేశాం” అని డాక్టర్ చెరియన్ చెప్పారు.
డాక్టర్ రవికుమార్, డాక్టర్ ఉదయ్ బేతపూడి (పీడియాట్రిషియన్లు), డాక్టర్ దినేష్ గోంట్ల, డాక్టర్ అరవింద్ గోగినేని (ఇంటెన్సివిస్టులు), అలాగే గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ రాజేష్ బత్తిన & డాక్టర్ రాజేష్ చంద్ర – వీరందరూ ప్రొఫెసర్ చెరియన్ సర్జికల్ టీమ్‌తో కలిసి పని చేసి, అత్యుత్తమ సమన్వయంతో, అత్యంత నైపుణ్యం కలిగిన “ట్రాన్స్‌ప్లాంట్ గ్రూప్”గా పని చేస్తున్నారు. ఇప్పటివరకు 800కిపైగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్లు చేసిన అనుభవం ఈ టీమ్‌కి ఉంది. ఇతర ఆసుపత్రులు నిరాకరించిన క్లిష్టమైన కేసులు కూడా ఇక్కడ విజయవంతం కావడం, ఈ బృందం ప్రత్యేకతను తెలియజేస్తుంది.
అందులో ఒక శిశువుకి, పోర్టల్ వెయిన్ థ్రోంబోసిస్ సమస్య వల్ల, ఇంటర్ పొజిషన్ గ్రాఫ్ట్ అనే ఒక క్లిష్టమైన శస్త్రచికిత్స అవసరం పడింది. ట్రాన్స్‌ప్లాంట్‌తోపాటు, లివర్‌కి సంబంధించి, స్ప్లీనోరీనల్ షంట్స్ వంటి అనేక ఇతర సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం చూపుతుంది, ఈ గ్రూప్.
బిడ్డ తండ్రి మాట్లాడుతూ, “మా అబ్బాయి రోజు రోజుకూ క్షీణిస్తుండగా, ఇంక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వెళ్లిపోయాం. ఆశలు వదులుకున్నాం. రాయలసీమలోని మా స్నేహితులు డాక్టర్ చెరియన్ గురించి చెప్పారు. ఆయనను కలిసిన తరువాత మాకు నమ్మకం కలిగింది. ఆయనతోపాటు మొత్తం టీమ్ అత్యంత శ్రద్ధతో, మా బిడ్డ మళ్ళీ ఆరోగ్యవంతంగా మాకు దక్కేలా చేసినట్టు అనిపిస్తోంది” అని తెలిపారు.
మణిపాల్ హాస్పిటల్ విజయవాడ డైరెక్టర్ రామాంజనేయ రెడ్డి మాట్లాడుతూ, “గత మూడు సంవత్సరాలుగా కోస్తా తీర ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న మా మణిపాల్-సౌత్ ఏషియన్ భాగస్వామ్యం, చాలా తక్కువ కాలంలోనే లివర్ వ్యాధులకి చికిత్సలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా నిలిచింది. ఇప్పటి వరకు100కి పైగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్లు, అందులో కొన్ని పిల్లల లివర్ ట్రాన్స్‌ప్లాంట్లు విజయవంతంగా చేశాం. ఈ పేషెంటుకు సీఎంఆర్ఎఫ్ & మణిపాల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించాయి. ప్రభుత్వానికి, ఫౌండేషన్‌కి ధన్యవాదాలు” అన్నారు.
వారంతా కోలుకోవడంలో, మళ్లీ తిరిగి సాధారణ జీవితాన్ని అనుభూతి చెందేందుకు, మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ, అన్ని విధాలా సహాయ సహకారాలందిస్తోంది. CMRF అండ్ మణిపాల్ ఫౌండేషన్ చొరవతో, పీడియాట్రిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్ విభాగంలో, అత్యవసరమైన ఎన్నో కుటుంబాలకు అండగా నిలబడింది అని పేర్కొన్నారు.





















