Kadambari Jethwani: వేధింపులపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన ముంబై నటి కాదంబరి జెత్వానీ
Vijayawada CP | కొన్ని నెలల కిందట తనపై జరిగిన వేధింపులపై బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ సీపీని కలిసిన నటి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
![Kadambari Jethwani: వేధింపులపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన ముంబై నటి కాదంబరి జెత్వానీ Mumbai Actress Kadambari Jethwani met Vijayawada CP files complaint over harassment incident Kadambari Jethwani: వేధింపులపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన ముంబై నటి కాదంబరి జెత్వానీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/30/f5efbb9e18b1eb852ef84072c1d428e51725032424224233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mumbai Actress Kadambari Jethwani met Vijayawada CP | విజయవాడ: గత ప్రభుత్వంలో తనపై, తన కుటుంబంపై జరిగిన వేధింపులపై ముంబై నటి కాదంబరి జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన నటి కాదంబరి జెత్వానీ శుక్రవారం నాడు విజయవాడకు వెళ్లి సీపీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన కేసుతో పాటు గతంలో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పై ముంబైలో తాను పెట్టిన కేసుపై వివరాలు విజయవాడ సీపీకి ఇచ్చారు. విజయవాడ పోలీసులు నటి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ప్రాణాలతో బయటపడతా అని అనుకోలేదని, కుటుంబం ప్రాణాలు కాపాడుకునేందుకు తాను ఇంతకాలం సైలెంట్ గా ఉన్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం సైతం ఈ విషయంపై స్పందించి విచారణకు అధికారి స్రవంతిని నియమించారు. ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం నటి కేసు విచారణ చేపట్టనుంది. స్రవంతిరాయ్ నటి కాదంబరి జెత్వానీ నుంచి వివరాలు సేకరించారు.
ఆ కేసులో ఆ నటి కుటుంబాన్ని అరెస్టు చేయడానికి ముంబైకి వెళ్లిన పోలీసులను విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది. అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీగా ఉన్న విశాల్ గున్ని సహా మరికొందరు పోలీసుల్ని ముంబై నుంచి నటి జెత్వానీని ఎందుకు, ఎలా తీసుకొచ్చారని పలు వివరాలు అడిగినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. వేరే రాష్ట్రానికి వెళ్లి మరి ఓనటిని, ఆమె కుటుంబాన్ని విజయవాడకు తరలించి వేధింపులకు గురి చేయడం చిన్న విషయం కాదని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
అసలేం జరిగిందంటే..
ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ ఇటీవల ఏబీపీ దేశంతో స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని నెలల కిందట తాను ఎదుర్కొన్న వేధింపులు, భయానక అనుభవాన్ని వివరించారు. ఏపీ నుంచి ఓ ఐపీఎస్ ఆదేశాలతో కొందరు పోలీసులు ఖరీదైన వాహనాలలో ముంబైకి వచ్చి తనను, తన కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఆమెపై చీటింగ్ కేసు నమోదైనట్లు చెప్పిన పోలీసులు, తమ నుంచి ఫోన్లు లాగేసుకుని.. సోషల్ మీడియాకు, బయటి ప్రపంచానికి దూరం చేశారని ఆరోపించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు నమోదు చేశారని.. వీటీపీఎస్ గెస్ట్‌హౌస్‌లో బంధించిన సమయంలో ఎలా వేధించారు, ఇబ్బంది పెట్టారో చెబుతూ నటి కాదంబరి జెత్వానీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
నటి కాదంబరి జెత్వానీ తనను రూ.5 లక్షలు మోసం చేసిందని కృష్ణా జిల్లా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు. అయితే అది దొంగ కేసు అని, కావాలనే అతడితో కేసు పెట్టించి తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని చెప్పారు. దీని వెనుక పెద్ద వ్యక్తుల హస్తం ఉందని, లేకపోతే పోలీసులు ఇలా చేసే అవకాశం లేదన్నారు. కొన్ని పేపర్లపై సెటిల్మెంట్ అని సంతకాలు చేపించుకున్న పోలీసులు, తనకు బెయిల్ ఇప్పించి ముంబైకి తిరిగి పంపించారని సంచలన విషయాలు వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)