Vallabhaneni Vamsi Facts: పరిటాల రైట్ హ్యాండ్, Jr ఎన్టీఆర్ ఫ్రెండ్.. టీడీపీ ఎమ్మెల్యే.. జగన్ కు ఫ్యాన్- ఎవరీ వల్లభనేని వంశీ
Andhra Pradesh News | పరిటాల రైట్ హ్యాండ్, Jr ఎన్టీఆర్ ఫ్రెండ్, ఆపై టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయ్యారు. తరువాత వైఎస్ జగన్ కు ఫ్యాన్‌గా మారిన వల్లభనేని వంశీ కెరీర్ విషయాలివే.

Vallabhaneni vamsi Arrest News | వల్లభనేని వంశీ.. రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వైల్డ్ ఫైర్ కాదు.. అంతకుమించి అన్నట్టు ఉంటుంది ఈయన వ్యవహారం. కోపం వస్తే ఎవరినైనా ఎంతటి వారినైనా తోచినట్టుగా విమర్శించగల దూకుడు నైజం ఈయన సొంతం. తాజాగా టిడిపి ఆఫీసులో ఆపరేటర్ పై దాడి,కిడ్నాప్ ఇలాంటి కేసులో అరెస్ట్ అయిన వంశీ నేపద్యంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వంశీ ఎవరు.. పరిటాల నుండి జగన్ వరకూ అంత తొందరగా ఎలా ఎదగలిగారో ఇప్పుడు చూద్దాం..!
గన్నవరం నుండి పరిటాల రైట్ హ్యాండ్ గా..
వల్లభనేని వంశీ లైఫ్ లో ట్విస్టులకు కొదవలేదు. ఉమ్మడి కృష్ణాజిల్లా గన్నవరం కు చెందిన ఆయన ఉన్నత విద్యావంతుడు. తన చదువుల కోసం ఎక్కువ కాలం తిరుపతిలోనే గడిపారు. అక్కడే ఎస్వీ యూనివర్సిటీ నుండి పీజీ చేశారు. తర్వాత అమెరికా వెళ్దాం ట్రై చేసినా అది వర్కౌట్ కాలేదు. దాంతో రాయలసీమలోనే రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తూ స్థిరపడ్డారు. తెలిసిన వ్యక్తి ద్వారా పరిటాల రవికి పరిచయమైన వంశీ కొద్దికాలంలోనే సన్నిహితుడుగా మారిపోయారు. వంశీ దూకుడు స్వభావం పరిటాల రవికి నచ్చింది. ఈలోపు టిడిపి అధికారం కోల్పోవడం పరిటాల వర్గంపై దాడులు జరుగుతున్న క్రమంలో కొందరు ఆయనకు దూరంగా ఉన్నా వల్లభనేని వంశీ మాత్రం రవి తోనే ఉన్నారు. ఇది పరిటాల రవికి ఆయన్ను మరింత దగ్గర చేసింది.
రవి హత్య అనంతరం గన్నవరం చేరుకున్న ఆయన రియల్ ఎస్టేట్లో బాగా గడించారని సైతం వినిపించింది. ఈలోపు విజయవాడలో పేరు మోసిన రాజకీయవేత్త దేవినేని నెహ్రూతో వల్లభనేని వంశీ కి కొన్ని విభేదాలు వచ్చాయి. నెహ్రును "ముసలి రౌడీ "అంటూ అప్పట్లో వంశీ చేసిన వ్యాఖ్యలపై నెహ్రూ తీవ్రంగా స్పందించారు. తర్వాత విజయవాడలోని పెద్దలు అందరూ కలిసి ఆ గొడవను సెటిల్ చేశారు. కానీ వంశీ లోని ఆ దూకుడు వైఖరిని రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసింది ఆ గొడవే
జూనియర్ ఎన్టీఆర్ తో ఫ్రెండ్షిప్.. టిడిపిలో సభ్యత్వం
తన పాత స్నేహితులైన కొడాలి నాని ద్వారా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు దగ్గరై తర్వాత ఫ్రెండ్ అయ్యాడు. ఆయన రిఫరెన్స్ తో 2006లో టిడిపిలో చేరి 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. కానీ లగడపాటి చేతిలో ఓడిపోయిన వంశీ తన దృష్టిని సినిమాలపై పెట్టారు. ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో సినిమా ఇండస్ట్రీలో పట్టు సాధించి కొన్ని సినిమాలు తీశారు. వాటిలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే మరపురాని చిత్రంగా మిగిలిపోయిన "అదుర్స్ (2010) " ఒకటి. "ఆ సినిమా మాత్రమే కాదు ముమైత్ ఖాన్ తో "పున్నమి నాగు (2009)", రవితేజతో " టచ్ చేసి చూడు (2018) " సినిమాలు కూడా వల్లభనేని వంశీ నిర్మించినవే.
ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణతో సైతం వంశీకి మంచి సాన్నిహిత్యం ఉండేది. ఒకవైపు సినిమాలు తీస్తూనే 2014 ఎన్నికల్లో టిడిపి నుండి గన్నవరం ఎమ్మెల్యేగా వంశీ గెలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ సునామీ ని సైతం తట్టుకొని టిడిపి ఎమ్మెల్యేగా గన్నవరం నుండి మరోసారి సత్తా చాటారు.
లోకేష్ తో విబేధాలు... జగన్ తో ఫ్రెండ్ షిప్
2919 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర సందర్భంగా ఆయన్ను వల్లభనేని వంశీ విష్ చేయడం టిడిపిలో తీవ్ర సంచలనం సృష్టించింది. అప్పటి నుంచే ఆయనపై పార్టీలో అనుమానాలు మొదలయ్యాయి. అయినప్పటికీ టిడిపి నుండే సీటు దక్కించుకొని ఆయన గెలిచారు. కానీ 2019 ఎన్నికల ఫలితాల నుండి వల్లభనేని వంశీకి టిడిపికి మధ్య గ్యాప్ రావడం మొదలైంది. గన్నవరంలో తనకంటూ ఒక వర్గాన్ని వంశీ మెయింటైన్ చేస్తున్నారనేది అక్కడి టిడిపిలో మొదలైన చర్చ అధిష్టానం వరకు వెళ్ళింది. ఈలోపు వల్లభనేని వంశీ పై వార్తాపత్రికల్లో కొన్ని వ్యతిరేక కథనాలు వచ్చాయి. వీటి వెనుక ఉన్నది లోకేష్ అంటూ వల్లభనేని వంశీ వర్గం తీవ్రంగా స్పందించింది. అప్పటికే తన మిత్రుడు కొడాలి నాని వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉండటం మొదలైంది.
టిడిపిలో ఒంటరితనం ఫీలైన వంశీ ఒకరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి టిడిపికి బై బై చెప్పేసారు. పార్టీకి రాజీనామా చేసి అసెంబ్లీలో వైసిపి సానుభూతిపరుడైన ఎమ్మెల్యే గా కొనసాగారు. ఆ సమయంలో ఆయన చంద్రబాబు పైన ఆయన సతీమణి పైన చేసిన విమర్శలు హద్దు దాటిపోయాయి. ముఖ్యంగా చంద్రబాబు సతీమణిపై గుప్పించిన ఆరోపణలు, దుర్భాషలు జుగుప్సాకర స్థాయికి వెళ్లిపోయాయి. ఆ సంఘటనలో వల్లభనేని వంశీ తో పాటు కొడాలి నాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటివారు ఉన్నారనేది టిడిపి ప్రధాన ఆరోపణ. ఆ సందర్భంగా చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం టిడిపి కేడర్ ను ఏకం చేసింది. వారి దృష్టిలో వల్లభనేని వంశీ ఒక ద్రోహిగా మిగిలిపోయారు. ఆ సంఘటన పై వల్లభనేని వంశీ సారీ చెప్పినా టిడిపి శ్రేణులు మాత్రం ఆయనను క్షమించలేదు.
2024 ఎన్నికల్లో వైసిపి నుండి గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేసిన వల్లభనేని వంశీ టిడిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. ఇక ఎన్నికల సందర్భంగా నారా లోకేష్ తన తల్లిని దూషించిన వంశీని వదిలేది లేదంటూ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు తర్వాత అంతా సైలెంట్ గానే ఉంది భావిస్తున్న తరుణంలో వంశీ పై కేసులు చకచకా ముందుకు వెళ్లాయి. 2023లో గన్నవరం టిడిపి ఆఫీస్ ను ధ్వంసం చేయడం.. అక్కడ స్టాప్ పై దాడికి పాల్పడిన కేసులో వంశీ ఏ 71 గా ఉన్నారు. కానీ రెండు రోజుల క్రితం సడన్గా అప్పట్లో కేసు పెట్టిన టిడిపి ఆఫీస్ ఉద్యోగి సత్య వర్ధన్ తన పిటిషన్ వెనుక్కు తీసుకోవడంపై దర్యాప్తు చేసిన పోలీసులు వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి దాడి చేయడం వల్లే అతను ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నట్టు టిడిపి ఆరోపిస్తోంది. మరోవైపు పాత కేసులో ఏ 71గా ఉన్న వల్లభనేని వంశీ కొత్త కేసులో A 1 గా మారిపోయారు. దానితో హైదరాబాదులో ఉంటున్నఆయన్ను పోలీసులు అరెస్టు చేసి ఏపీకి తరలించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

