Gottipati Ravi Kumar: ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవి బాధ్యతలు, 3 కీలక ఫైళ్లపై సంతకాలు
Andhra Pradesh News: ఏపీ ఇంధన శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి మూడు ఫైల్స్ పై సంతకాలు చేశారు.
Gottipati Ravi Kumar takesh charge as Energy minister of Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 40వేల 336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై తొలి సంతకం చేశారు మంత్రి గొట్టిపాటి రవి. రాష్ట్ర సచివాలయంలో శనివారం ఆయన వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఏపీ విద్యుత్, ఇంధనశాఖల మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
విద్యుత్ కనెక్షన్ల మంజూరు కోసం సంతకాలు
మంత్రి గొట్టిపాటి రవికుమార్ మొత్తం మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 40వేల 336 కొత్త వ్యవసాయ విద్యుత్ కనక్షన్లు మంజూరు చేస్తూ ఫైల్ పై తొలి సంతకం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసులకు దశలవారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరు చేస్తూ రెండో సంతకం చేశారు. అనంతరం ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో ఇంటింటికి 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించడానికి సంబంధించిన దస్త్రంపై మూడో సంతకం చేశారు.
అనంతరం ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు, తనకు విద్యుత్ శాఖ మంత్రిగా ఛాన్స్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అందించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి, ఏపీలో ప్రజలకు మెరుగైన రీతిలో విద్యుత్ అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. దేశంలో విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడు చంద్రబాబు అని, టీడీపీ హయాంలో ఆయన తీసుకు వచ్చినన్ని విద్యుత్ సంస్కరణలు మరెవరూ తీసుకురాలేదని గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
దేశంలోనే ఏపీని బెస్ట్ శాఖగా తీర్చిదిద్దుతాం
దేశంలోనే ఉత్తమ విద్యుత్ శాఖగా ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖను తీర్చిదిద్దడానికి కృష్టి చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ శాఖను నిర్వీర్యం చేయడంతో పాటు వారి హయాంలో ఏకంగా 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపారని ఆరోపించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి రవి కుమార్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి అవసరాన్నిబట్టి విద్యుత్తు చార్జీలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
గొట్టిపాటి రవికుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఒంగోల్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్ర వర్మ సహా పలువురు నేతలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.