Jogi Ramesh: బీసీల సంక్షేమంపై చర్చకు రెడీ, చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్ - లోకేష్ పాదయాత్రకు 3 పేర్లు సూచన
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పాదయాత్ర యువగళంకు ఆ మూడు పేర్లు సూట్ అవుతాయంటూ ఏపీ మంత్రి జోగి రమేష్ సెటైర్ వేశారు. బీసీల సంక్షేమంపై చర్చకు రెడీ అని చంద్రబాబుకు సవాల్ విసిరారు.
Jogi Ramesh Suggests 3 Names to Nara Lokesh Padayatra: చేతకాని నేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎవరైనా ఛాన్స్ ఇస్తారా అని ఏపీ మంత్రి జోగ రమేష్ వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పాదయాత్రకు ఆ మూడు పేర్లు పప్పు గళం, తుప్పు గళం, చిప్పగళం సూట్ అవుతాయంటూ జోగి రమేష్ సెటైర్ వేశారు.
2022 రాష్ట్ర ప్రజలకు విజయనామ సంవత్సరం...
2022 ఏడాది టీడీపీ అధినేత చంద్రబాబుకు, టీడీపీకి బూతుల నామ సంవత్సరమని మంత్రి జోగి రమేష్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు విజయనామ సంవత్సరంగా అభివర్ణించారు. అధికార దాహానికి ప్రజలు బలిదానాలు చేయాలా అని చంద్రబాబును జోగి రమేష్ ప్రశ్నించారు. కందుకూరు ఘటనలో బాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో ప్రతి వ్యక్తి, ప్రతి కులం... అందరూ ప్రగతి సాధించాలన్నదే లక్ష్యమని ఆయన వెల్లడించారు. అదే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని తెలిపారు. చంద్రబాబు తనచుట్టూ నలుగురు బీసీలను పెట్టుకుని, ఇస్త్రీ పెట్టె పట్టుకొని, మగ్గం నేసి, చేపను పట్టుకోవటం దారుణమని అన్నారు. చంద్రబాబు సిగ్గు, శరం, చీము నెత్తురు అన్నింటిని వదిలేశాడంటూ మండిపడ్డారు. 1
14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు గతంలో బీసీలు గుర్తుకు రాలేదా? ఇస్త్రీ చేసే మేము, కుండలు చేసే మేము, కల్లు గీసుకునే మేము, గొర్రెలు కాచుకునే మేము, మగ్గం నేసే మేము, మా పిల్లలు ఇంకెంత కాలం ఇవే వృత్తుల్లో మగ్గిపోవాలి, మా జీవితాలు మారకూడదా ? మేం ఎదగకూడదనేదే చంద్రబాబు దుర్గార్గపు ఆలోచన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల పిల్లలు దేశానికే తలమానికంగా తయారు కావాలని, ప్రపంచాన్ని చుట్టి రావాలని, విద్యార్థులకు ట్యాబ్‌లు, బైజూస్ కంటెంట్ ను చేతుల్లో పెడుతుంటే చంద్రబాబు మాత్రం, బీసీంతా ఇంకా కల్లు గీయాలని, గొర్రెలు కాయాలని, చూడడటం ఏంటని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లలను సీఎం జగన్ ఇంగ్లండ్, అమెరికా, కెనడా పంపిస్తానంటుంటే, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు బాగుపడుతుంటే మీ ఏడుపు ఎందుకుని చంద్రబాబుని నిలదీశారు.
చేతకాని బాబుకు ఎవరైనా ఛాన్స్ ఇస్తారా... చంద్రబాబు ఒక్క ఛాన్సివ్వాలని అంటున్నారని, చేత కానోడికి ఎవరైనా ఛాన్సు ఇస్తారా అని ప్రశ్నించారు. చెడు చేసిన వారికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే పరిస్దితి లేదన్నారు.
బాబు సవాల్ ను స్వీకరిస్తున్నా..
డేట్, టైమ్, ప్లేస్... చెబితే తానే చర్చకు వస్తానని చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. 2024లో మరోసారి బీసీలు బాబు నడ్డివిరుస్తారని, 82 వేల మంది బీసీలను ప్రజాప్రతినిధులను చేసింది జగన్ మాత్రమేనని అన్నారు.సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా, ఆరోగ్య పరంగా 2022.. రాష్ట్రానికి విజయనామ సంవత్సరమని వ్యాఖ్యానించారు. 2023లో మనసున్న జగన్ నాయకత్వంలో ఇంకా రెండడుగులు ముందుకేసీ డీబీటీ ద్వారా ప్రతి గడపకు దగ్గరయ్యేలా మరింత మేలు చేస్తామని చెప్పారు.
కందుకూరు లో 8 మందిని పొట్టనబెట్టుకున్నారు..
కందుకూరులో 8 మంది చనిపోయిన 24 గంటలు గడవకుండానే, వెంటనే ఎవరైనా సభ పెట్టటం చంద్రబాబుకే చెల్లిందన్నారు.అదేమంటే చనిపోయిన వారు త్యాగం చేశారంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు.చంద్రబాబు,లోకేష్ ఎందుకు త్యాగాలు చేయరని ప్రశ్నంచారు.చంద్రబాబు అధికారం కోసం ప్రజలు బలిదానం చేయాలా, త్యాగాలు చేయాలా అని జోగి రమేష్ అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నడ్డి బీసీలే విరుస్తారని అన్నారు
పప్పు గళంగా మార్చుకో..
పాదయాత్రకు పేటెంట్ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ కి మాత్రమే ఉందని జోగి రమేష్ అన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు అర్హడు కాదన్నారు. అదేమైనా ఫిజికల్ ఎక్సర్‌సైజా? పొలిటికల్ ఎక్సర్‌సైజా అని సెటైర్లు వేశారు. లోకేష్ పాదయాత్ర యువగళం పేరును పప్పు గళం, తుప్పు గళం, చిప్పగళంగా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు మంత్రి జోగి రమేష్.