(Source: ECI/ABP News/ABP Majha)
Andhra Pradesh: ఏపీలో అందుబాటులోకి మరో పథకం- వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో చంద్రబాబు కీలక నిర్ణయం
Chandra Babu: గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు కనిపించకూడదని ఆదేశించిన చంద్రబాబు అంబులెన్స్ వ్యవస్థ స్ట్రీమ్‌లైన్ చేయాలని చెప్పారు. గతంలో ఉన్న ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని పునఃప్రారంభించాలని సూచించారు.
NTR Baby Kits Scheme: ఆంధ్రప్రదేశ్‌లో మరో పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వీలైన త్వరగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇది గతంలో అమలు చేసిన పథకమే అయినా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేసింది. ఇప్పుడు మళ్లీ పునఃప్రారంభించాలని చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
201-19 మధ్య అమలు చేసిన ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని తిరిగి స్టార్ట్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని పునః ప్రారంభంతోపాటు ఆసుపత్రులు, కిడ్నీరోగులు, ఇతర అంశాలపై ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పుట్టిన పిల్లల కిడ్నాప్‌లు అనే మాటే వినిపించకూడదని స్పష్టం చేశారు చంద్రబాబు. అలాంటి వార్తలు వస్తే కచ్చితంగా అధికారులపై చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో తరచూ కనిపించే డోలీలో గర్భిణులను, బాలింతలను తీసుకెళ్లే పరిస్థితికి వీలైనంత త్వరగా స్వస్తి చెప్పాలని ఆదేశించారు చంద్రబాబు. అలాంటి పరిస్థితి లేకుండా ఏం చేయాలో ఆలోచించాలని సూచించారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఫీడర్ అంబులెన్సులు, సాధారణ అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వాటిని మరింత సమర్థంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో అలసత్వం వహించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
గిరిజన ప్రాంతాలను కూడా తాను సందర్శిస్తానని... ప్రజలకు సేవలు అందే విషయంలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం కచ్చితంగా ఉపేక్షించే పరిస్థితి లేదని చంద్రబాబు హెచ్చరించారు. అంబులెన్స్ సర్వీస్‌పై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్నారు. ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించాలని సూచించారు. ఆసుపత్రుల్లో చనిపోయిన వారిని వారి ఇళ్లకు తరలించేందుకు కూడా అంబులెన్స్ వాడాలని టూవీలర్స్‌పై తీసుకెళ్లే సీన్స్ కనిపించకూడదన్నారు.
ప్రభుత్వం తరఫున యాప్ క్రియేట్ చేసి ప్రజల హెల్త్ అప్‌డేట్స్ అందులో పొందుపరిచాలని సూచించారు చంద్రబాబు. ఎవరు ఎక్కడ చికిత్స తీసుకున్నా అందులో వివరాలు నమోదు చేసేలా వ్యవస్థను సిద్ధం చేయాలని తెలిపారు. హెల్తా డేటా ఉంటే ఏ ప్రాంతంలో ఏ రోగులు ఉన్నారు. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనే విషయాలపై ప్రభుత్వానికి ఓ క్లారిటీ ఉంటుందని వివరించారు.
ఉద్దానంలో కాకుండా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు వస్తున్నాయని దీనిపై ఓ అధ్యయనం చేయాలన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో అసలు కిడ్నీ బాధితులు ఎంత మంది ఉన్నారు. దానికి కారణాలు ఏంటీ, ఆయా ప్రాంతాల్లోనే కిడ్నీ జబ్బులు రావడానికి కారణాలేంటి అనేది తేల్చాలని సూచించారు. టీబీ రోగులకు మందులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పింఛన్ కోసం నకిలీ సర్టిఫికేట్స్ సృష్టించకుండా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ప్రతి నియోజకవర్గానికి స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇవి పీపీపీ విధానంలో పని చేస్తాయని పేర్కొన్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వమే స్థలం కేటాయిస్తుందని తెలిపారు. అత్యుత్తమ వైద్య సేవలు రాష్ట్రంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను చంద్రబాబు అధికారులకు వివరించారు.
మరోవైపు విశాఖలో నిర్లక్ష్యానికి గురైన మెడ్‌టెకె జోన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇప్పటికే ఆ జోన్ అందుబాటులో ఉండి ఉంటే తక్కువ ఖర్చుతోనే వైద్య పరికారాలు సరఫరా అయ్యేదని అలాంటి కీలకమైన జోన్‌ను వైసీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.