AP Teacher Awards: ఉత్తమ అధ్యాపకులు, ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేసిన చంద్రబాబు, లోకేష్
Andhra Pradesh News | రాష్ట్రవ్యాప్తంగా 166 మంది ఉత్తమ అధ్యాపకులు, ఉపాధ్యాయులను సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు.
Education Day in Andhra Pradesh | విజయవాడ: ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో జాతీయ విద్యా దినోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది. విజయవాడ ఏ కన్వెన్షన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, భారత తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటాలకు సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు.
ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా గురుపూజోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేసి వెలకట్టలేని వారి సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఈ ఏడాది విజయవాడ వరదలు కారణంగా ఈ కార్యక్రమాన్ని నవంబర్ 11కు వాయిదా వేశారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి అయిన నవంబర్ 11న ఏపీలో జాతీయ విద్యాదినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఇద్దరు మహానుభావుల విద్యాసేవలను స్మరించుకుంటూ ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే పురస్కారాల ప్రధానోత్సవాన్ని ప్రభుత్వం సోమవారం నిర్వహించింది.
166 మంది ఉత్తమ అధ్యాపకులు, ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
రాష్ట్రస్థాయి కమిటీ ద్వారా ఎంపికైన 166 మంది ఉత్తమ అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ఏపీ సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ఉత్తమ అధ్యాపకులు, ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి మెరిట్ సర్టిఫికెట్, మెడల్, జ్ఞాపిక, 20వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి మొత్తం 68 మంది ఉపాధ్యాయులను 2024 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇద్దరు నేషనల్ అవార్డు గ్రహీతలు, ఇంటర్మీడియట్ విద్య నుంచి 25 మంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి 16 మంది, హయ్యర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి యూనివర్సిటీ ప్రొఫెసర్లు 32 మంది, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ 19 మంది, ఇంజనీరింగ్, ఫార్మసీ నుంచి నలుగురిని ఎంపిక చేయడం జరిగింది. వీరందరినీ ఘనంగా సత్కరించారు.