AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Former AP CID Chief Sanjay Suspended | ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనను విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh News | *సర్వీసు నిబంధనల ఉల్లంఘన వ్యవహారంలో సంజయ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు*
*నిధులు, అధికార దుర్వినియోగం చేశారని సంజయ్‌పై అభియోగాలు*
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసు నిబంధనల ఉల్లంఘన వ్యవహారంలో సంజయ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. నిధులు, అధికారం దుర్వినియోగం చేశారని సంజయ్‌పై అభియోగాలు ఉన్నాయి. టెండర్లు లేకుండా ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌లు కొనుగోలు చేశారని, అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనని సస్పెండ్ చేసిన ప్రభుత్వం, విచారణ పూర్తయ్యే వరకు విజయవాడ వదిలి వెళ్లవద్దని సంజయ్‌కు ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..
అగ్నిమాపకశాఖ నిరభ్యంతర పత్రాలను ఆన్‌లైన్‌లో జారీచేసేందుకు వీలుగా అగ్ని- ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కోసం 2023లో అగ్నిమాపకశాఖ డీజీ హోదాలో సంజయ్ టెండర్లు పిలిచారు. బిడ్లు సమర్పించేందుకు కొన్ని సంస్థలనే ఆహ్వానించగా 3 కంపెనీలే బిడ్లు వేశాయి. సౌత్రిక టెక్నాలజీస్ సంస్థ లోయెస్ట్ బిడ్డర్ (Lowest Bidder) కాకపోయినా ఎల్-1గా ఎంపిక చేసి కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణలున్నాయి. బిడ్ల సాంకేతిక మదింపు హడావుడిగా ముగించారు. సౌత్రిక సంస్థ ఆ సంస్థ అనుభవం, సమర్థతలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎల్-1గా ఎంపిక చేయడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.
అగ్నిమాపకశాఖ అధికారుల కోసమంటూ ఒక్కో ల్యాప్‌టాప్, ఐప్యాడ్‌కు రూ.1.78 లక్షలు వెచ్చించి 10 పరికరాలను సౌత్రిక టెక్నాలజీస్ నుంచి సంజయ్ కొనుగోలు చేశారు. కానీ మార్కెట్ ధరల కంటే అధికంగా వెచ్చించి ఆ సంస్థకు రూ.17.89 లక్షలు చెల్లించారని సమాచారం. ఎలాంటి టెండర్లు, కాంపిటీటివ్ బిడ్లు లేకుండానే ఆ సంస్థకు వీటి సరఫరాకు ఆర్డర్లు ఇచ్చారు. అందుకు కనీసం బిల్లులూ సమర్పించలేదని ఆరోపణలు ఉన్నాయి. దీనిలోనూ అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కోసం సౌత్రిక టెక్నాలజీస్‌కు రూ.2.29 కోట్లు చెల్లించేలా గత ఏడాది ఫిబ్రవరి 15న సంజయ్ ఒప్పందం చేసుకున్నారు. కేవలం వారంలో రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 22న ఆ సంస్థకు రూ.59.93 లక్షలు చెల్లింపులు జరిగాయి.