(Source: ECI/ABP News/ABP Majha)
Kodikatti Case : కోడికత్తి కేసు నిందితుడికి జన్మభూమి కమిటీ సిఫార్సుతో ఇంటి స్థలం, ఫ్లెక్సీపై గరుడ ఫొటో - సీఎం జగన్ తరఫు న్యాయవాది వాదనలు
Kodikatti Case : విజయవాడ కోర్టులో కోడికత్తిపై సోమవారం వాదనలు జరిగాయి. జగన్ తరఫు న్యాయవాది 4 గంటల పాటు వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.
Kodikatti Case : విజయవాడ NIA కోర్టులో సోమవారం జగన్ పై హత్యాయత్నం కేసుపై విచారణ జరిగింది. నాలుగు గంటల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. సీఎం జగన్ తరఫు లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వరరావు వాదనలు పూర్తి చేశారు. నిందితుడు శ్రీనివాసరావు తరపు లాయర్, NIA వాదనలు ఈ నెల 20న వింటామని న్యాయమూర్తి తెలిపారు. కోడికత్తి కేసులో తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేసింది కోర్టు. కోడి కత్తి కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఎన్ఐఏ కోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. ఎన్‌ఐఏ, నిందితుడి శ్రీనివాసరావు తరపున న్యాయవాదులు వేసిన కౌంటర్లపై సీఎం జగన్ తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.
జగన్ తరఫు న్యాయవాది వాదనలు
ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసుపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు.. న్యాయమూర్తి ఎదుట వాదనలు నాలుగు గంటల పాటు వాదనలు వినిపించారు. ఒకే రోజున 35 మంది సాక్ష్యులను అధికారులు విచారించారని తెలిపారు. మూడు బృందాల అధికారులు ఈ విచారణ జరిపారన్నారు. ఎన్ఐఏ ఛార్జ్ షీట్ చదివితే తదుపరి దర్యాఫ్తు అవసరమని సాధారణ పౌరుడికి సైతం అర్థమవుతుందన్నారు. సీఎం జగన్ వాంగ్మూలాన్ని అదనపు ఎస్పీ తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. జన్మభూమి కమిటీ సిఫార్సుతో నిందితుడు శ్రీనివాసరావుకు తానేకంక గ్రామంలో ఇంటి స్థలం వచ్చిందని జగన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. నిందితుడు శ్రీనును పథకం ప్రకారమే టీడీపీ నేత హర్ష వర్ధన్ చౌదరి రెస్టారెంట్ లోకి తీసుకెళ్లారన్నారు. నిందితుడి గ్రామంలోని ఫ్లెక్సీపై సినీనటుడు ముందుగా చెప్పిన గరుడ ఫొటో ఎందుకు వచ్చిందని వాదించారు. నిందితుడు శ్రీనివాస్ పై కేసు ఉన్నప్పటికీ విశాఖ ఎయిర్ పోర్టు అథారిటీ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా జారీ చేసిందో విచారణ జరపాలని కోర్టును కోరారు. ఫుడ్ అండ్ ఫ్యూజన్ అధినేత, టీడీపీ సానుభూతిపరుడు హర్షవర్థన్ చౌదరిని ఎన్ఐఏ విచారించలేదన్నారు. ఎన్ఐఏ మొదటి పిటిషన్ వేసిన తర్వాత మరలా ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని కోర్టుకు తెలిపారు. బాధితునిగా సీఎం జగన్‌కు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయించాలని అడిగే హక్కు ఉందని వాదనలు వినిపించారు.
23 రోజుల్లో అభియోగ పత్రం ఎలా?
కోడి కత్తి కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 23 రోజుల్లోనే ఎన్‌ఐఏ అభియోగ పత్రం దాఖలు చేసిందని జగన్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంత తొందరగా అభియోగ పత్రం ఎలా దాఖలు చేయగలుగుతారని కోర్టులో వాదించారు. మొత్తం 39 మంది సాక్షులను కేవలం ఐదు రోజులోనే విచారణ చేశారని, వారి సాక్ష్యాలు నమోదు చేశారన్నారు. ఒకే రోజున 35 మంది సాక్ష్యాలను విచారించారన్నారు. మూడు బృందాల అధికారులు ఈ విచారణ చేశారని న్యాయవాది... ఛార్జ్ షీట్ చదివితే తదుపరి దర్యాఫ్తు అవసరమని సాధారణ ప్రజలకు కూడా అర్థమవుతుందన్నారు. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సపోర్టర్ హర్షవర్ధన్ ప్లాన్ ప్రకారమే రెస్టారెంట్‌లోకి తీసుకెళ్లారని వాదించారు.