Vasantha Krishna Prasad : మళ్లీ మొదటికి మైలవరం పంచాయతీ - తాను ఎక్కడికీ వెళ్లడం లేదన్న వసంత కృష్ణ ప్రసాద్ !
Mylavaram YSRCP : మైలవరం వదిలి ఎక్కడికీ వెళ్లేది లేదని వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. ఆయన స్థానాన్ని మార్చాలని సీఎం జగన్ అనుకోవడంతో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరిగింది.
Mylavaram YSRCP Vasantha Krishna Prasad : వైఎస్ఆర్‌సీపీలో టిక్కెట్ల కసరత్తు అంశం అటూ ఇటూ సాగుతోంది. మైలవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను తప్పించాలని సీఎం జగన్ నిర్ణయించడంతో ఆయన అలిగి వెళ్లిపోయారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి రెండు, మూడు సార్లు పిలిచినా రాలేదు. తాను పోటీ నుంచి విరమించుకుంటున్నానని ప్రకటించారు. అయితే హఠాత్తుగా గురువారం ఆయన క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన తాను మళ్లీ మైలవరం నుంచే పోటీ చేస్తానన్నట్లుగా మాట్లాడుతున్నారు. తాను మైలవరం ను వదిలి పెట్టి వెళ్లబోనని అంటున్నారు.
సీఎం జగన్ హామీ ఇచ్చారా ?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశానుసారం నడుచుకుంటానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో వంతెన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే వసంత మీడియాతో మాట్లాడారు. సీఎంవో కార్యాలయం నుంచి పిలుపు రావడంతో తాను తాడేపల్లి వెళ్లినట్లు వివరించారు. ఈ భేటీలో నియోజకవర్గానికి సంబంధించిన నిధులు, పనులను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ముఖ్యంమత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి సంబంధింత పనులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. తనను మైలవరంలోనే పని చేసుకోవాలని చెప్పారన్నారు.
మైలవరాన్ని వదిలి ఎక్కడికీ వెళ్లేది లేదు !
2019 ఎన్నికల్లో పంతం కోసం పనిచేసి దేవినేని ఉమా మహేశ్వరరావును ఓడించానని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ మైలవరం నియోజకవర్గం ప్రజలకు కుటుంబ సభ్యుడిగా ఉంటానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. మొదటినుంచి తాను రాజకీయాలకు దూరంగానే ఉన్నానని తెలిపారు. రాజకీయంగా సీఎం జగన్ తనకు అవకాశం కల్పించారని అన్నారు. గతంలో తనను ఓడించిన వ్యక్తిని ఓడించానని చెప్పుకొచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లో మైలవరం వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పుకొచ్చారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని...మైలవరం సీటుపై ఎటువంటి అపోహలు లేవు అని చెప్పుకొచ్చారు. తనను నమ్ముకున్న వ్యక్తులని వదిలి ఎక్కడికి వెళ్ళను అని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు.
జోగి రమేష్‌కు నిరాశేనా ?
మైలవరం నుంచి అభ్యర్థిని మార్చి మంత్రి జోగి రమేష్ కు చాన్సిచ్చారన్న ప్రచారం జరిగింది. వసంత కృష్ణప్రసాద్ ను జగ్గయ్యపేట నుంచి పోటీ చేయామని సూచించారని అంటున్నారు. దానికి ఆయన అంగీకరించలేదు. చివరికి మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కే టిక్కెట్ కేటాయించారని చెబుతున్నారు. మొత్తంగా వైసీపీలో టిక్కెట్ల పంచాయతీ క్రమంగా వేడెక్కుతోంది.