Good News For AP: బడ్జెట్ రోజు ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ వ్యయం సవరణకు ఆమోదం
బడ్జెట్ రోజు ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ వ్యయం సవరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Polavaram Project News | న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ రోజు ఏపీకి మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.30,436.95 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వకు ఆమోదం తెలిపింది. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రావాల్సిన బకాయిలు రూ.12,157 కోట్లు మేర ఉన్నాయి.
ఉడాన్ సేవలపై బడ్జెట్‌లో ప్రకటన
మరోవైపు కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ఉడాన్ సేవలపై ప్రకటన చేశారు. సామాన్యులకు సైతం విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన పథకం ఉడాన్(Udan) లో మరిన్ని సవరణలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర బడ్జెట్ (Budget 2025)ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 120 కొత్తప్రదేశాలకు విమాన సర్వీసులు అందిస్తాం. దాంతో 4 కోట్ల మంది కొత్త ప్రయాణికులకు విమాన సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు ఆమె ప్రకటించారు.
ఇప్పటికీ విమాన కనెక్టివిటీ లేని కొండ ప్రాంతాలతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో ఉడాన్ స్కీమ్ కింద సమీపంలో చిన్నచిన్న విమానాశ్రయాలు, హెలిప్యాడ్‌లు నిర్మించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పనులతో పలు మారుమూల ప్రాంతాల మధ్య ఎయిర్ కనెక్టివిటీ పెరగడంతోపాటు ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణం చేయవచ్చని వివరించారు. ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సైతం అరకు(Araku), పాడేరు ప్రాంతాల్లో చిన్న విమానాశ్రయం నిర్మించాలనే రాష్ట్రం తరఫున కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. తద్వారా అరకులో పర్యాటరంగం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.






















