Undavalli On YSRCP : ఏపీలో వైసీపీ లేదు - అలా చేస్తేనే మనుగడ - జగన్‌కు ఉండవల్లి కీలక సలహాలు
Andhra News : పార్టీని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలో జగన్ కు ఉండవల్లి సలహాలు ఇచ్చారు. బూతులు మాట్లాడేవారిని పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీగా పోరాడాలన్నారు.
YSRCP News : ఏపీలో ఇక వైసీపీ లేదని.. మనుగడ కోసం కింది స్థాయి నుంచి పార్టీని నిర్మించుకోవాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ కు సలహా ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. ఎన్నికలకు ముందు కూటమి పుంజుకుందని.. నెల రోజుల్లోనే పూర్తి మార్పు వచ్చిందని విషయాన్ని వైసీపీ నాయకులతోపాటు ఆ పార్టీ అధినేత జగన్‌ను కూడా హెచ్చరించానని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఫలితాలను చూసి వైసీపీ నేతలు షాక్‌కు గురయ్యారు కానీ తాను మత్రం ఊహించానన్నారు.
బూతులు మాట్లాడకుండా నేతలకు ట్రైనింగ్ ఇవ్వాలి !
ప్రస్తుత ఎన్నికల ఫలితాలను చూస్తే కనీసం వచ్చే ఎన్నికల వరకు పార్టీపై దృష్టి సారించాలని జగన్‌కు సూచించారు. ఇప్పటి నుంచే పార్టీని నిర్మించుకోవాలన్నారు. ఎక్కడా కూడ అశ్రద్ధ వహించకుండా దగ్గరుండి చూసుకోవాలన్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి రాజకీయమంటే తెలియదని.. అసలు ఏ ఒక్కరికైనా సబ్జెక్ట్‌పై అవగాహన లేదని విమర్శలు గుప్పించారు. ఎంతసేపు బూతులు మాట్లడడమేనని ఫస్ట్ చేయాల్సింది వైసీపీ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వాలని హితవు పలికారు. ఎక్కడపడితే అక్కడ శాసనసభల్లోనూ ప్రెస్ మీట్ ల్లోనూ బూతులు మాట్లాడడం మానేయాలని సూచించారు. వైసీపీ ఓడిపోడానికి ప్రధాన కారణం వాలంటీర్లేనని వారికి చంద్రబాబు అందరికీ జీతం ఎక్కువగా ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. దీంతో వాలంటీర్లు వైసీపీకి ఓట్లు వేయలేదని విశ్లేషించారు.
వాలంటీర్లను నమ్ముకుని ఓడిపోయిన వైసీపీ
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించేయాలనే ఒకే ఒక్క నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పవన్ కల్యాణ్ విజయవంతమయ్యారు. అంతేకాదు.. ఏపీలో తెలుగుదేశం పార్టీ బలం చాలా సమర్థవంతంగా వుంది. ఆ పార్టీని ఎదుర్కోవడం అంత తేలిక కాదు. వచ్చే ఐదేళ్లలో పార్టీని బలంగా తయారుచేసుకునేందుకు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. ఎవడి తలరాతనైనా తలకిందులు చేయగల సత్తా పవన్ కల్యాణ్‌కి వున్నదనడంలో ఎంతమాత్రం సందేహం లేదన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా వైసిపి లేనేలేదు. పార్టీలో పైన జగన్ వున్నారు, కింద ఓటర్లు వున్నారు, మధ్యలో వాలంటీర్లు ఉన్నారని సెటైర్లు వేశారు.
నిరాశపడకూడదు..పోరాడాలని వైసీపీకి ఉండవల్లి సూచన
1989లో ఎంజీఆర్ చనిపోయిన తర్వాత ఎన్నికలు జరిగితే కరుణానిధి పార్టీకి 169 సీట్లు వచ్చాయని.. జయలలిత పార్టీకి కేవలం 30 సీట్లే వచ్చాయని చెప్పారు. అదే 1991లో ఎన్నికలు జరిగితే జయలలితకు 285 సీట్లు వచ్చాయని.. కరుణానిధికి కేవలం ఏడు సీట్లే వచ్చాయని గుర్తుచేశారు. అప్పుడు కరుణానిధి ఏడుస్తూ ఇంట్లోనే కూర్చోలేదని.. ప్రతిపక్షంలో ఉండి పోరాడాడని చెప్పారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో 221 సీట్లతో కరుణానిధి గెలిస్తే.. జయలలితకు నాలుగు సీట్లే వచ్చాయని అన్నారు. నిస్సత్తువ, నిస్సహాయత ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావడం అనవసరమని ఉండవల్లి తేల్చి చెప్పారు.