TTD Governing Council: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచుతూ ఉత్తర్వులు
TTD Governing Council: టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
TTD Governing Council: పారిశుద్ధ్య కార్మికులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 5 వేల మందికి జీతాలను రూ. 12 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.కార్పొరేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రతి ఏడాది 3 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలాగే, కార్పొరేషన్ లో పని చేసే ఉద్యోగులు అకాల మరణం పొందితే రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేషన్ లో పని చేస్తూ ఈఎస్ఐ వర్తించని ఉద్యోగులకు హెల్త్ స్కీ వర్తింపచేయనున్నట్లు వెల్లడించారు. అలిపిరి వద్ద ప్రతి నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
పలు నిర్మాణాలకు నిధులు
నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్టుమెంట్ల ఏర్పాటుకు రూ.18 కోట్లు కేటాయించినట్లు ఛైర్మన్ తెలిపారు. ఆకాశగంగ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రూ.40 కోట్లతో 4 వరుసల రోడ్డు, వరాహ స్వామి అతిథి గృహం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రూ.10.8 కోట్లతో 4 వరుసల రోడ్డు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి చెర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు రూ.25 కోట్లతో 4 వరుసల రోడ్డు నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అలాగే గరుడ సర్కిల్ వద్ద రోడ్డు అభివృద్దికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పర్యవేక్షణకు కమిటీ
టీటీడీ పరిధిలోని పురాతన ఆలయ గోపురాల నిర్వహణ పర్యవేక్షణకు కమిటీని నియమించనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. అలాగే టీటీడీ పరిధిలో పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించేందుకు నిధులు పెంచుతున్నట్లు చెప్పారు. టీటీడీ కళ్యాణ మండపాల్లో వివాహాల సందర్భంగా డీజేలకు బదులుగా లలితా గీతాల ఆలాపనకు మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ ఆస్థాన విధ్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రానికి వినతించనున్నట్లు వెల్లడించారు.
అలాగే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. తిరుపతిలో టీటీడీ అనుబంధ ఆలయాలు, భక్తులు సంచరించే ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఆ భాధ్యతలను టీటీడీ పరిధిలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.