TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం
Andhrapradesh News: తిరుమలలో రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ఊరట కలిగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Ttd Key Decision On Vip Darshan: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (Ttd) గుడ్ న్యూస్ చెప్పింది. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుండడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఇంటర్, టెన్త్ పరీక్షలు పూర్తి కావడంతో స్కూళ్లకు సెలవుల నేపథ్యంలో తిరుమలకు ఇటీవల భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజూ వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో సామాన్య భక్తులకు ఊరట కలిగించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. వీఐపీ దర్శనాల తొలగింపుతో సామాన్య భక్తులు దర్శనాలకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం రాదని అధికారులు తెలిపారు. అటు, ఎన్నికల కోడ్ లో భాగంగా ఇప్పటికే సిఫారసు లేఖలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు.
భక్తులకు సౌకర్యాలు
మరోవైపు, ఎండల తీవ్రత నేపథ్యంలో స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. క్యూలైన్లలో ఉండే భక్తులకు మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదం అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్లప్పుడూ తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా మాఢ వీధుల్లో భక్తులు చెప్పులు లేకుండా నడవడానికి ఇబ్బంది లేకుండా కూల్ పెయింటింగ్ తో పాటు తాగునీటి సౌకర్యాలు కూడా కల్పించినట్లు చెప్పారు. అలాగే, ఉగాది పర్వదినాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీటీడీ పంచాంగాన్ని కేవలం తిరుపతి, తిరుమలలోనే కాకుండా టీటీడీ బుక్ స్టాల్స్ లోనూ అలాగే, హైదరాబాద్, విశాఖ, విజయవాడ, బెంగుళూరు, చెన్నై నగరాల్లోని టీటీడీ సమాచారం కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.