(Source: Poll of Polls)
KS Rama Rao: చంద్రబాబుని మీకు తెలీకుండానే అరెస్టు చేస్తారా? రాష్ట్రపతిపాలన విధించండి - ప్రధానికి సీనియర్ నిర్మాత లేఖ
మోదీ జీ-20 సదస్సులో బిజీగా ఉన్న సమయంలో హడావుడిగా చంద్రబాబు అరెస్టు జరిగిందని గుర్తు చేశారు.
ప్రధాని మోదీకి టాలీవుడ్ సీనియర్ నిర్మాత కె.ఎస్ రామారావు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల కేఏ ఎస్ రామారావు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. మోదీకి తెలియకుండానే చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించారా? అని లేఖలో ప్రశ్నించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాగా విసిగిపోయానని.. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసక పాలన మొదలుపెట్టారని అన్నారు. ఏపీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిపే వరకు రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని కేఎస్ రామారావు ప్రధాని మోదీని కోరారు.
మోదీ జీ-20 సదస్సులో బిజీగా ఉన్న సమయంలో హడావుడిగా చంద్రబాబు అరెస్టు జరిగిందని గుర్తు చేశారు. సీఎం జగన్ లండన్‌లో ఉన్న సమయంలో ఈ అరెస్ట్ జరిగిందని.. అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ఏపీలో రాజకీయ కక్షలు, కుంభకోణాలు, అక్రమ కేసులు, శాంతి భద్రతల సమస్య అధికంగా ఉందని అన్నారు. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరపున బాధతో, బాధ్యతతో అడుగుతున్నానని అన్నారు.
చంద్రబాబుపై ఏ ఆధారాలు లేకున్నా జైలులో పెట్టడం చూసి తన హృదయం రగిలిపోతోందని కేఎస్ రామారావు ఆవేదన చెందారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేకపోయినప్పటికీ రాష్ట్ర పౌరుడిగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాగా విసిగిపోయినట్లుగా నిర్మాత చెప్పారు. రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అమరావతితో పాటు అన్ని సమకూర్చారని, ఇప్పుడు జగన్ అన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. శంకుస్థాపనకు ప్రధాని కూడా వచ్చిన విషయాన్ని కేఎస్ రామారావు గుర్తు చేశారు. ఆ తర్వాత 16 నెలలు జైలులో గడిపి, ఆర్థిక మోసాల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ అధికారంలోకి వచ్చారని.. తొలుత ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసక పాలన మొదలుపెట్టారని ఆరోపించారు.
స్వయంగా మీరే శంకుస్థాపన చేసిన రాజధానిని తరలించవద్దని సీఎం జగన్‌ను మీరే హెచ్చరించాల్సి ఉందని అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులను చంద్రబాబు అరెస్ట్ వార్త చాలా బాధ కలిగించిందని అన్నారు. రోడ్ల మీదకు వచ్చి వారు తెలిపిన నిరసనను.. ప్రధాన మంత్రిగా మీరు గమనించి ఉండాలని కేఎస్ రామారావు లేఖలో పేర్కొన్నారు.
ఆనాడు నేషనల్ ఫ్రంట్‌కు మద్దతుగా
ఎన్టీఆర్ ఉన్న సమయంలో నేషనల్ ఫ్రంట్‌కు ఎన్టీ రామారావు ఛైర్మన్‌గా ఉన్నప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు చేసిన కృషిని కేఎస్ రామారావు గుర్తు చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతను జైల్లో ఇబ్బందులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే జోక్యం చేసుకొని చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయించాలని కేఎస్ రామారావు ప్రధానిని కోరారు.
రాష్ట్రపతి పాలన విధించండి
అంతేగాక, ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయించాలని నిర్మాత కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేదాకా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. తద్వారా తెలుగు ప్రజలు బీజేపీని కూడా నమ్ముతారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే దిశగా ఆలోచించాలని నిర్మాత కేఎస్ రామారావు ప్రధాని మోదీని లేఖలో కోరారు.