Tirumala: 93 మందితో శ్రీవారి దర్శనానికి వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ - అందరికీ వీఐపీ దర్శనమే!
ఇందులో 20 ప్రోటోకాల్ దర్శనాలు పొందగా, మిగిలిన 73 మందికి సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలను పొందారు.
తిరుమలలో అధికార పార్టీ ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే గోర్లే కిరణ్ కుమార్, ఎంపీ బెల్లానా చంద్రశేఖర్ లు ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనానికి తనతో పాటుగా 93 మందిని తీసుకొచ్చారు. వీరందరిని వీఐపీ బ్రేక్ దర్శనానికి తీసుకెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. తమ నియోజకవర్గానికి చెందిన 93 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలంటూ టీటీడీ జేఈవో కార్యాలయంలోని అధికారులపై ఒత్తిడి తీసుకుని రావడమే కాకుండా, పైనుంచి ఒత్తిడులు తీసుకొచ్చి 93 వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఇందులో 20 ప్రోటోకాల్ దర్శనాలు పొందగా, మిగిలిన 73 మందికి సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలను పొందారు. సాధారణంగా వారాంతాల్లో సామాన్య భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యాన్ని త్వరగా కల్పించాలనే ఉద్దేశంతో ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు టీటీడీ కల్పిస్తుంది. కానీ, అధికార పార్టీ నేతల ఒత్తిడితో యథేచ్ఛగా వీఐపీ దర్శనాలను కల్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనిపై సామాన్య భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
టీటీడీ చెప్తుంది ఒకటైతే చేస్తుంది మరొకటి అంటూ సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ పలుమార్లు టీటీడీ వ్యవహార శైలిపై హిందూ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ వీఐపీ దర్శనాలను పరిమిత సంఖ్యలోనే కల్పించాలని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ కండువాతో వచ్చిన ఎమ్మెల్సీ
టీటీడీ నిబంధనలను అధికార పార్టీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. తిరుమలలో రాజకీయ పార్టీ జెండాలు, కండువాలు, ప్రచారాలు చేయకూడని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా తిరుమలకు పార్టీ కండువాలతో వచ్చేస్తున్నారు కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తన కారులో వైసీపీ పార్టీ కండువాను తీసుకుని వచ్చారు. శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో కారును ఆపిన ఎమ్మెల్సీ కారులో అధికార పార్టీ కండువాను చూసి కొందరు భక్తులు మండిపడుతున్నారు.
తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడిని, వాహనాన్ని ముందుగా అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసినంతరం కొండకు అనుమతిస్తుంటారు. అయితే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రాజకీయ పార్టీకి చెందిన కండువాలు, గుర్తులు, జెండాలతో నేరుగా కొందరు ఏడుకొండలకు వెళ్తున్నారు. దీనిపై హిందూ సంఘాలు మండిపడ్డుతున్నా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు విమర్శిస్తున్నారు.