Tirumala: వర్షాలు కారణంగా శ్రీవారి దర్శనం చేసుకోలేపోయిన వారికి టీటీడీ శుభవార్త
గత వారంలో చిత్తూరులో వర్షాలు బీభత్సం సృష్టించాయి. చిత్తూరుతోపాటు నెల్లూరు, కడప జిల్లాల్లో కూడా వానలు దంచి కొట్టాయి. అదే టైంలో శ్రీవారి దర్శనానికి టెకెట్లు బుక్ చేసుకోని చాలా మంది వెళ్లలేకపోయారు.
శ్రీవారి భక్తులకు శుభవార్త ప్రకటించింది టీటీడీ. భారీ వర్షం కారణంగా నవంబరు 18 నుంచి 30వ తేదీ వరకు శ్రీవారి దర్శనానికి రాలేని భక్తులకు మరో ఛాన్స్ ఇస్తోంది. వేరే సమయంలో తిరిగి దర్శనం కల్పించాలని టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టారు.
టీటీడీ ఛైర్మన్ ఆదేశాల మేరకు వర్షాల టైంలో తిరుమల చేరుకోలేకపోయిన వారి కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రెడీ చేస్తున్నారు. దర్శన టికెట్లు ఉన్న భక్తుల కోసం ఈ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందించి 6 నెలల్లోపు తిరిగి స్లాట్ బుక్ చేసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మరేకు ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి.
తిరుమలలో అధిక వర్షపాతం నమోదైనా ఒకటి, రెండు ప్రదేశాలు మినహా పెద్దగా నష్టం వాటిళ్లలేదని, తిరుమల చక్కగా ఉందని, భక్తులు నిర్భయంగా వచ్చి స్వామివారి దర్శించుకోవచ్చని తెలిపారు ధర్మారెడ్డి. అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే ఘాట్ రోడ్డలో 13 చోట్ల వర్షానికి భూమి నాని వదులుకావడంతో రక్షణ గోడలు జారి రోడ్డుకు అడ్డంగా పడ్డాయని, పలు చోట్ల చెట్ల కూలాయని, వీటన్నింటినీ యుద్ధప్రాతిపదికన తొలగించామన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు ధర్మారెడ్డి. తిరుమల నుంచి తిరుమలకు వెళ్లే రోడ్డులోనూ ఎలాంటి సమస్య లేదన్నారు. ఈ రెండు ఘాట్ రోడ్లలో నాలుగు రోజుల నుంచి వాహనాలు చక్కగా ప్రయాణిస్తున్నాయని, భక్తులు నిస్సంకోచంగా స్వామివారి దర్శనానికి రావచ్చని తెలియజేశారు.
అలిపిరి మార్గంలోని నడకదారి చక్కగా ఉందని, భక్తులు నడిచి తిరుమలకు వెళ్లవచ్చని వివరించారు ధర్మారెడ్డి. శ్రీవారి మెట్టు మార్గంలో నాలుగు కల్వర్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. సామర్థ్యానికి మించి వర్షపు నీరు రావడం, నీటిప్రవాహంతోపాటు బండరాళ్లు వేగంగా వచ్చి ఢీకొనడంతో కల్వర్టులు దెబ్బతిన్నాయని తెలిపారు. కల్వర్టుల వద్దకు వాహనాలు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేదని, వీటి పునర్నిర్మాణానికి అవసరమైన సామగ్రిని మనుషులే తీసుకువెళ్లాల్సి రావడంతో ఆలస్యమవుతోందని చెప్పారు. భక్తులు నడించేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామని, అంతవరకు ఈ మార్గం మూసి ఉంటుందని అన్నారు.
నవంబరు 25 నుంచి 28వ తేదీ వరకు తిరిగి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ మేరకు పరిస్థితిని ఎదుర్కొనేందుకు టిటిడిలోని ఇంజినీరింగ్, అటవీ, ఆరోగ్య, భద్రత తదితర అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ధర్మారెడ్డి తెలిపారు. ముందస్తుగా అవసరమైన జెసిబిలు, హిటాచీలు, ట్రక్కులు, చెట్లు కూలితే వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. బసకు సంబంధించి తిరుమల నారాయణగిరి విశ్రాంతి గృహంలో రెండు గదులు మాత్రమే దెబ్బతిన్నాయని, మిగతా చోట్ల 7 వేల గదుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. అన్నదానం, కల్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఎలాంటి ఇబ్బందు లేవని, భక్తులు నిస్సంకోచంగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలియజేశారు.
Also Read: ఓ అడుగు వెనక్కి వేసి.. మరో అవకాశం సృష్టించుకున్న జగన్ ! బిల్లుల ఉపసంహరణ వెనుక పక్కా రాజకీయ వ్యూహం !