TTD News: వన్యమృగాలు ఎందుకు దారి తప్పుతున్నాయి? తిరుమలలో ఈ మధ్య దాడులు ఎందుకు పెరిగాయి?
కొద్ది రోజులుగా శేషాచలం అటవీ ప్రాంతం నుండి బయటకు వచ్చిన వన్యమృగాలు ఇటు టిటిడిని, అటు శ్రీవారి భక్తులను టెన్షన్ కు గురి చేస్తున్నాయి.
జీవ వైవిధ్యం కలిగిన దట్టమైన అటవీ ప్రాంతం నుండి వన్యమృగాలు దారి తప్పి ఎందుకు బయటకు వస్తున్నాయి. మనుషులను చూస్తే పక్కకు జారుకునే వన్యమృగాలు చిన్నారులపైన దాడులు చేస్తున్న సందర్భాలు ఎందుకు నెలకొంటున్నాయి. ఒక్కసారి శేషాచలం అటవీ ప్రాంతంలో వన్యమృగాల సంతతి పెరగడమే దాడులకు ముఖ్య కారణమా? అసలు శేషాచలం అటవీ ప్రాంతంలో ఏం జరుగుతుంది? వన్యమృగాలు బయటకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
కోట్లాది మంది ఆరాధ్యదైవమైన శ్రీనివాసుడు కొలువైయున్న తిరుమలలో ప్రస్తుతం వన్యమృగాల సంచారం అధికమైంది. గత కొద్ది రోజులుగా శేషాచలం అటవీ ప్రాంతం నుండి బయటకు వచ్చిన వన్యమృగాలు ఇటు టీటీడీని, అటు శ్రీవారి భక్తులను టెన్షన్ కు గురి చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్ 22వ తారీఖున అలిపిరి నడక మార్గంలో ఓ ఐదేళ్ళ బాలుడు కౌశిక్ పై దాడి చేసిన చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్ళి, బాలుడుని తీవ్రంగా గాయపరిచింది. అయితే చిరుత దాడి నుండి పూర్తి బాలుడు కోలుకోవడంతో టీటీడీ, శ్రీవారి భక్తులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను మరువక ముందే బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనకు కూతవేటు దూరంలోనే ఆరేళ్ళ బాలిక లక్షితపై దాడి చేసిన చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్ళి క్రూరంగా చంపేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా టీటీడీ ఉలిక్కి పాటుకు గురైంది.
చిరుతలు సంతతి పెరిగేందుకు కారణాలు అవేనా?
శేషాచల అటవీ ప్రాంతంలో కోవిడ్ ముందు వరకు చిరుతల సంతతి తక్కువగా ఉండేది. కేవలం తిరుమల పరిసర ప్రాంతాల్లో 8 నుంచి 10 వరకు ఉన్న చిరుతల సంఖ్య ఉండేది. కోవిడ్ సమయంలో భక్తుల రద్దీ లేకపోవడం కారణంగా ఈ ప్రాంతం ఒక్కసారిగా నిర్మానుషంగా మారిన సందర్భంలో చిరుతలకు స్వేఛ్ఛ లభించడంతో చిరుతలు కలయిక అధికంగా జరిగింది. దీంతో వీటి సంతతి గణనీయంగా పెరిగింది. ఇటీవల చిన్నారులపై చిరుతపులులు దాడి చేసిన ఘటన తర్వాత టీటీడీ అటవీశాఖ అధికారులు చిరుతల సంతతిపై పూర్తిస్థాయిలో ఆరా తీశారు. ఈ క్రమంలోనే తిరుమల పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం 40కు పైగానే చిరుతలు సంఖ్య ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. చిరుతలతో పాటుగా, ఎలుగుబంటుల సంచారం టీటీడీని కలవర పాటుకు గురి చేస్తుంది.
ఇక సాధారణంగా వర్షా కాలంలో(చిత్త కార్తీక మాసం) నెలలో చిరుతలు అధికంగా కలయిక సాగించే మాసం కావునా చిరుతలు ఒకవైపు నుండి మరోవైపుకు కలయిక సాగించేందుకు వెళ్తున్న తరుణంలో చిరుతల సంచారం అధికంగా ఉండవచ్చనే టీటీడీ అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే అలిపిరి నడక మార్గంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంకు కోతవేటు దూరంలో ఉన్న ఓ నీటి తొట్టిలో రెండు రోజుల క్రితం ఓ ఏలుగుబంటి ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే మత్తు మందు ఇచ్చి ఎలుగుబంటిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు సహాలవిధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ అధికారుల ప్లాన్ ను చిత్తు చేస్తూ ఏలుగుబంటి తప్పించుకుంది. ఈ క్రమంలో శ్రీవారి మెట్టు మార్గంతో పాటుగా అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటులను బంధించేందుకు 100 మంది సిబ్బందిని టీటీడీ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.
శేషాచలం అటవీ ప్రాంతం నుండి వన్యమృగాలు బయటకు వచ్చేందుకు కారణాలు ఇవే. ???
దట్టమైన చెట్లతో నిండిన శేషాచల అటవీ ప్రాంతం ఎన్నో వన్యప్రాణులు, వన్యమృగాలకు ఆవాస స్థలం. తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే మార్గాలలో వన్యప్రాణులు భక్తులకు కనువిందు చేస్తూ ఉంటాయి. ఇలా వన్యప్రాణులను చూసిన భక్తులు ఆనందంతో వాటికి ఆహారం తినిపించేందుకు, వాటితో ఫోటోలు దిగేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే వన్యప్రాణులు ఆయా ప్రదేశాలలో అధికంగా తిరుగుతూ ఉండడం కారణంగా ఆ ప్రదేశాలకు వేట సాగించేందుకు చిరుతలు వస్తున్నట్లు టీటీడీ అటవీశాఖ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా శేషాచలం అటవీ ప్రాంతంలో వన్యమృగాలు నీటి కొరత ఉండడం కారణంగా దాహార్తిని తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుండి బయటకు వస్తున్నాయని, అయితే నడక మార్గాలకు దూరంగా అటవీ ప్రాంతంలో చెక్ డ్యాంలను ఏర్పాటు చేయడం ద్వారా వన్యమృగాలు అక్కడే ఉండే సంచరించే అవకాశం ఉంటుందని అటవీ శాఖ నిపుణులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో అన్ని రకాల జంతువుల సమతుల్యంగా ఉన్నప్పుడే పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. శేషాచలంలోని చిరుతలను, ఎలుగుబంటులను ఇక్కడి నుండి తరలిస్తే, పర్యావరణ అసమతుల్యం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిరుతల వేటలో అధికారులు అతిఉత్సాహం చూపించకుండా నడక మార్గాలకు సమీపంలోని వన్యమృగాల బంధించి వాటిని మాత్రమే మరోక ప్రాంతంలో వదిలి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
వన్యమృగాలు సంచారంపై అధికారులు చెబుతున్నది ఇదే. ???
చిరుత దాడి నేపథ్యంలో తిరుమల అటవీ ప్రాంతంలోని అలిపిరి నడక మార్గంలో 300 ట్రాప్ కెమెరాలు, శ్రీవారి మెట్టు మార్గంలో యనభై ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని సిసిఏఫ్ నాగేశ్వర రావు వెల్లడించారు. అదేవిధంగా 100 మంది సిబ్బంది క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారని, మోకాళ్ళ మెట్టు, నరసింహస్వామి ఆలయం ఆవరణలో ట్రంక్ లైజింగ్ ఎక్వింప్మెంట్ సిద్దంగా పెట్టుకున్నాంమని, మెట్ల మార్గంలో వంద మంది గ్రూప్ లుగా వెళ్ళాలని కోరారు. టీటీడీ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, చిరుత, ఎలుగు బంటి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయని, నడక మార్గంలో గణనీయంగా తగ్గిన భక్తులు సంఖ్య తగ్గిందన్నారు. లక్షితను చంపినది చిరుతనే అని నిర్ధారణ అయ్యింది. కానీ ఇప్ఒటి వరకూ పట్టుకున్న రెండు చిరుతలో ఏది అనేది రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. ఏడో మైలు వద్ద ఒక చిరుత, ఎలుగు బంటి మాత్రమే ఉన్నట్టు కెమెరా ట్రాప్ ద్వారా తెలుస్తోందని, వైల్డ్ లైఫ్ ఇండియా వారి గైడ్ లైన్స్ ప్రకారం కంచె ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందని, మహారాష్ట్ర నుంచి కొన్ని బోనులు తీసుకు వచ్చి వాటిని కొన్ని రీమోడల్ చేస్తున్నట్లు చెప్పారు. కంఫా ఫండ్స్ తో అటవీ సమీప ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాంమని, జూలై నుంచి సెప్టెంబర్ వరకు జంతువులు సంపర్కం సమయం వల్ల చిరుతల కదలికలు ఎక్కువ అయ్యాయని సిసిఏఫ్ నాగేశ్వరరావు తెలియజేశారు.