Tirumala Laddu Row : తిరుమల లడ్డు అపవిత్రతపై విచారణకు ఆదేశించిన టీటీడీ, బ్లాక్‌లిస్టులోకి ఓ కాంట్రాక్టర్
Tirumala Tirupati Laddu Row: శ్రీవారి లడ్డు వివాదంపై గతంలోనే టీటీడీ విచారణ చేపట్టి చర్యలు కూడా చేపట్టిీంది. 2023 ఆగస్టు నుంచి KMF నెయ్యి సరఫరా నిలిపేయగా.. అప్పటి నుంచి లడ్డు నాణ్యతపై విమర్శలు
Tirumala Laddu Row :తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ ఆనవాళ్లు ఉన్నాయన్న నివేదికలు దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. తిరుమల తిరుపతి దేవస్థానం గతంలోనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి శ్యామలారావు జులై 2024లోనే ఒక కమిటీని వేశారు. తిరుమల లడ్డు ప్రసాదం సహా ఇతర ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో అడల్ట్రేషన్ జరిపినట్లు తేలిన కొన్ని సంస్థలను కూడా బ్లాక్‌లిస్టోలో పెట్టారు.
జులైలోనే నలుగురు సభ్యుల కమిటీ వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం:
తిరుమల లడ్డు తయారీ కోసం వినియోగించే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్స్‌తో పాటు ఫిష్ ఆయిల్ వంటి అవశేషాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్ట్స్ బహిర్గతం అయిన వేళ.. 2024 జులై 23నే ఈ తరహా తప్పులను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపేందుకు నలుగురు సభ్యుల కమిటీని వేసింది. ఈ కమిటీలో డాక్టర్ సురేంద్రనాథ్, డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ మాధవన్ సభ్యులుగా ఉన్నారు. వారం రోజుల తర్వాత అన్ని కోణాల్లో విచారణ చేసిన కమిటీ తన నివేదికను సమర్పించిన్ది . విచారణ జరిపి నివేదిక ఇవ్వడమే కాకుండా మున్ముందు ఇలాంటి ఘోరాలు జరగకుండా చూసేందుకు.. టెండర్ల ద్వారా నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిందని శ్యామలారావు వివరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంకి పంపే నెయ్యి నాణ్యంగా ఉండాలని సప్లయర్స్‌కు పదేపదే చెబుతుంటామని.. అయితే ఒక కాంట్రాక్టర్ పంపిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు NABL రిపోర్ట్స్ స్పష్టం చేశాయని.. అందుకే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో ఉంచామని చెప్పారు. మరో సంస్థ కూడా నాశిరకం నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు తాము గుర్తించామని శ్యామలా రావు తెలిపారు. ఒక వేళ టీటీడీకి ఘీ సప్లై చేసే కాంట్రాక్టర్లు టెండర్ నాటి కండిషన్స్ వయోలేట్ చేసినట్లు తేలితే వారిపై ఎప్పటికప్పుడు టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుందని స్ఫష్టం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానంకి సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతను పరీక్షించడానికి అవసరమైన టెక్నాలజీ ఇక్కడ అందుబాటులో లేదని.. ఇదీ వ్యవస్థలోని లోపమేనని ఈవో ఒప్పుకున్నారు. ఆ తరహా వ్యవస్థను సమకూర్చుకోవాల్సి ఉందన్నారు.
గురువారం నాడు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థ NDDB CALF రిపోర్టు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కోసం వినియోగిస్తున్న నెయ్యిలో అడల్ట్రేషన్ జరుగుతోందని.. అందులో ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు అవశేషాలు ఉన్నాయని రిపోర్టు బహిర్గతం చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా ఉన్న వైష్ణవ సంఘాలు, శ్రీవారి అభిమానులు, హిందూ సంఘాలు మండి పడుతున్నాయి. జరిగిన ఘటనపై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
2023 జులై నుంచి నెయ్యిసరఫరా నిలిపేసిన కేఎమ్ఎఫ్.. జూన్ 2023లో 42 ట్రక్‌ల నెయ్యి వెనక్కి:
2023 ఫిబ్రవరిలో తిరుమలకు 15 వందల కిలమీటర్ల రేడియస్‌లోని గోశాలల నుంచి TTD 10 లక్షల కేజీల అగ్‌మార్క్ గ్రేడ్ నెయ్యి కొనుగోలు చేసింది. ఈ విధానం స్థానిక డైరీలకు ఉపకరిస్తుందని చెప్పుకొచ్చింది. అప్పటి వరకూ ఉన్న KMF నందినీ నెయ్యిని పక్కకు నెట్టి మల్టీ వెండార్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరకు నెయ్యి సరఫరాచేసే వారికి టెండర్ కట్టబెట్టింది. ఈ క్రమంలో కొత్త కాంట్రాక్టర్లు సరఫరా చేసిన నెయ్యి TTD బోర్డు కండిషన్స్‌కు అనుగుణంగా లేని కారణఁగా 42 ట్రక్కుల నెయ్యిని వెనక్కి పంపారు. CFTRI నిర్వహించిన ల్యాబ్ టెస్టుల్లో అడల్ట్రేషన్ జరుగుతున్నట్లు నిర్ధరణ అయ్యింది. ఈ సమయంలోనే TTD చర్యలను కర్ణాటక మిల్క్‌ఫెడరేషన్ తప్పు పట్టింది. నాణ్యతలేని నెయ్యిని TTD ప్రొక్యూర్ చేస్తోందని ఆరోపించింది.
ఆగస్టు 2023 నుంచి నందిని నెయ్యి సరఫరా నిలిపివేత:
నందిని నెయ్యి పూర్తి ప్రమాణాలు పాటిస్తూ అత్యంత నాణ్యమైన నెయ్యిగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన సంస్థ అని.. అలాంటిది తాము రేటు విషయంలో కాంప్రమైజ్ కాలేకే TTDకి 2023 ఆగస్టు నుంచి నెయ్యి సరఫరా నిలిపి వేసినట్లు నాడే తెలిపింది. ఐతే నాటి ఈవో ధర్మారెడ్డి మాత్రం.. గడచిన 20 ఏళ్లలో ఒక్కసారి మాత్రమై నందిని నెయ్యి తీసుకున్నామని.. అంతేకానీ స్థిరంగా వారి దగ్గర నెయ్యి కొన్న దాఖలాలు లేవంటూ నాటి ఈవో ధర్మారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఈ క్రమంలో 2024 జూన్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త ఈవో శ్యామలారావు .. వచ్చీ రాగానే లడ్డు నాణ్యతపై వస్తున్న విమర్శల నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించి నలుగురు సభ్యుల కమిటీ వేసి.. వారిచ్చిన నివేదికలకు అనుగుణంగా చర్యలుకూడా తీసుకున్నారు. ఇదంతా జులైలోనే జరగ్గా.. తెలుగు దేశం పార్టీ ఆ నివేదికలను గురువారం నాడుబయట పెట్టడంతో దేశం మొత్తానికి విషయం తెలిసింది.
రాజకీయ రంగు పులుముకున్న వివాదం:
బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు.. కూటమి 100 రోజుల పాలనకు సంబంధించిన సభలో.. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీయడం కోసం నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిపిందంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం సృష్టించాయి. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి.. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవుడి సన్నిధిలో ప్రమాణం చేద్దామంటూ సవాల్ కూడా చేశారు. మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ ఆ రిపోర్టులు విడుదల చేయడంతో.. దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది.