Tirumala News: తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి, భక్తులకు టీటీడీ కీలక సూచనలు
Kumaradhara Theertha Mukkoti: ఫిబ్రవరి 24 ఉదయం 5.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు.
![Tirumala News: తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి, భక్తులకు టీటీడీ కీలక సూచనలు TTD completes arrangements for Kumaradhara Theertha Mukkoti to be held on February 24 in Tirumala Tirumala News: తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి, భక్తులకు టీటీడీ కీలక సూచనలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/83a395d305f15cd422bc19ee241f6abf1708692256378234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kumaradhara Theertha Mukkoti in Tirumala: తిరుమలలో ఫిబ్రవరి 24న శనివారం జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం, పోలీసు అధికారులు శుక్రవారం తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమీక్ష నిర్వహించారు.
శనివారం ఉదయం 5.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతి లేదు. గోగర్భం నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రయివేటు వాహనాలను అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరడమైనది. పాపవినాశనం నుండి కుమారధార తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
మార్గమధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాపవినాశనం డ్యామ్ వద్ద ఉదయం 6 గంటల నుండి భక్తులకు పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రయివేటు సంస్థలు, వ్యక్తులు అన్నదానం చేసేందుకు అనుమతి లేదు. ఇంజినీంగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అంబులెన్స్‌లు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు.
ఈ సమీక్షలో తిరుమల అదనపు ఎస్పీ శ్రీ శివరామిరెడ్డి, విజిఓలు శ్రీ నందకిషోర్, శ్రీ గిరిధర్, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ఇఇ-1 శ్రీ జగన్మోహన్‌రెడ్డి, ఎవిఎస్వోలు శ్రీ గిరిధర్, శ్రీ మనోహర్, శ్రీ శివయ్య, శ్రీ శైలేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)