TTD Board Meeting: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం - సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్ల జారీపై కీలక నిర్ణయం
TTD Governing Council Meeting: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన దాదాపు 64 అంశాల అజెండాతో పాటు టేబుల్ అజెండా కింద పలు అంశాలపై పాలక మండలి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
TTD Board Meeting: తిరుపతి : తిరుమలలో నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరుగనుంది. స్ధానిక అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subba Reddy) అధ్యక్షతన దాదాపు 64 అంశాల అజెండాతో పాటు టేబుల్ అజెండా కింద పలు అంశాలపై పాలక మండలి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో ప్రధానంగా వారపు ఆర్జిత సేవలు తాత్కాలికంగా రద్దుపై పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. ఇక సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల (TTD sarva darshan tokens) జారీపై చర్చ జరుగనుంది. దివ్యదర్శనం టోకెన్లు పునఃప్రారంభించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. వేసవి రద్దీ నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై పాలక మండలిలో నిర్ణయం తీసుకోనున్నారు.
గరుడ వారధి, శ్రీవాణి ట్రస్టు విరాళాలతో నూతన ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయింపుపై పాలక మండలిలో చర్చ జరుగనుంది. అదే విధంగా స్విమ్స్ ఆసుపత్రిలో రోగుల సహాయకులు సౌకర్యార్ధం షెడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయింపు అంశంపై నేటి పాలక మండలి సమావేశంలో చర్చ జరుగనుంది. ఎలక్ట్రిక్ బస్సు స్టేషనుతో పాటు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. ఆప్కో మెగా షోరూం ఏర్పాటు, ఇళ్ళు, దుకాణాలు లీగల్ హైర్, కొనుగోలు చేసి వారి లైసెన్స్‌ల క్రమబద్దీకరణపై పాలక మండలిలో చర్చ జరుగనుంది..
చాలా ఏళ్ల నుంచి వివాదంలో ఉన్న 84 టెండర్ షాపుల కేటాయింపు, యాక్సిస్ బ్యాంక్ ఈ-లాబి ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా అన్నమయ్య మార్గంలోని నడకదారి, రోడ్డు మార్గం ఏర్పాటుపై అటవీ శాఖ నివేదికపై చర్చించనున్నారు. అటవీ శాఖ సిబ్బంది టైం స్కేలు వర్తింపుపై చర్చిస్తారు. టీటీడీలో ఖాళీగా ఉన్న క్వార్టర్స్ ను కార్పోరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమలలోని టీటీడీ క్వార్టర్స్ మరమ్మత్తులకు నిధుల కేటాయింపుపై చర్చ జరుగనుంది. శ్రీవారి మొట్టు మార్గాని భక్తులకు అందుబాటులో తీసుకుని రావడంపై నిర్ణయం తీసుకోనున్నారు. మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన క్యాన్సర్ హాస్పిటల్ ను ఐదోవ తేదీన ప్రారంభానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం, పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం చేత భూమి పూజ కార్యక్రమంపై, దేశవాళీ గోవుల సేకరణపై పాలక మండలి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.