Weather Updates: ఏపీలో భానుడి భగభగలు, తెలంగాణలోనూ 45 డిగ్రీల ఉష్ణోగ్రత - రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Temperature in Andhra Pradesh: వడగాల్పుల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. ప్రజలు మధ్యాహ్నం వేళ ఇళ్లనుంచి బయటకు రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heatwave in Telangana: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. వడగాల్పులు అధికంగా వీస్తున్నాయని, ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. పలు చోట్ల వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో మరో 24 గంటల పాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి..
ఆంధ్రప్రదేశ్‌లో భగభగలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యానాం ప్రాంతాల్లో వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ప్రస్తుతానికి అత్యధికంగా తిరుపతి నగరంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోగా.. తిరుపతి తర్వాత విజయవాడ కొండపల్లిలో ఉష్ణోగ్రతలు 44.8 డిగ్రీలను తాకుతోంది. మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతేనే గొడుగు వెంట తీసుకుని బయటకు వెళ్లాలని లేకపోతే వడగాల్పుల ప్రభావంతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. వేసవికాలంలో ప్రతిరోజూ దాదాపు 5 లీటర్ల వరకు మంచినీళ్లు తాగాలని, డీహైడ్రేషన్‌కు గురవకుండా ఉండాలంటే పండ్ల రసాలు తాగడం మంచిదని ప్రజలకు సూచించారు.
పగటి పూట ఇంటి కిటికీలను మూసి ఉంచడం ద్వారా వడగాలులు ఇంట్లోకి రావు. దాంతో ఇంట్లో వేడిగాలుల ప్రభావం కొంతమేర తగ్గుతుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. రాయలసీమలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగడంతో నిప్పుల కొలిమిలా ఈ జిల్లాలు మారిపోయాయి. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు ఉన్నవారు ఈ వేసవిలో త్వరగా డీహైడ్రేషన్‌కు గురై తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు
తిరుపతి సిటీ – 45.1 డిగ్రీలు
రేణిగుంట, తిరుపతి – 44.9 డిగ్రీలు
విజయవాడ – 44.8 డిగ్రీలు
వినుకొండ, గుంటూరు – 44.2 డిగ్రీలు
నందికొట్కూరు, కర్నూలు – 44.1 డిగ్రీల మేర ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో వెదర్ అప్‌డేట్స్..
రాష్ట్రంలో మరో 24 గంటలపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె. నాగరత్నం పేర్కొన్నారు. తెలంగాణలో ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయి. నైరుతి, దక్షిణ దిశల నుంచి గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో గరిష్టంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ లో ముఖ్యంగా ఉప్పల్ - ఎల్.బీ.నగర్ పరిధిలో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది.
తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇవే..
ఆదిలాబాద్ – 45.1 డిగ్రీలు
నిజామాబాద్ – 45 డిగ్రీలు
జగిత్యాల – 44.9 డిగ్రీలు
నిర్మల్ – 44.8 డిగ్రీలు
మంచిర్యాల – 44.4 డిగ్రీలు